Shoaib Akhtar: కశ్మీర్‌పై విషం కక్కిన షోయబ్.. యూటర్న్!

  • సల్మాన్ బెయిలుకు కశ్మీర్ స్వాతంత్య్రానికి ముడిపెట్టిన షోయబ్
  • ఏదో ఒక రోజు ఆ చల్లని వార్త వింటానని ట్వీట్
  • విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్ డిలీట్

సల్మాన్‌ఖాన్‌కు బెయిలు రావడాన్ని కశ్మీర్‌తో ముడిపెట్టి వివాదాస్పద ట్వీట్ చేసిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ యూటర్న్  తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన అక్తర్ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

శనివారం జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ ఖాన్‌కు బెయిలు మంజూరు చేయడంపై షోయబ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. అంతటితో ఊరుకోకుండా కొంత పైత్యాన్ని జోడించి ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలైన కశ్మీర్, పాలస్థీనా, యెమన్, అఫ్ఘనిస్తాన్ సహా ఇతర ప్రాంతాలకు కూడా స్వాతంత్య్రం లభించిందన్న వార్తను ఏదో ఒకరోజు తాను వింటానన్న ఆశ ఉందని పేర్కొన్నాడు. అమాయక పౌరులు మరణిస్తుంటే తన హృదయం ద్రవించిపోతోందంటూ మొసలి కన్నీరు కార్చాడు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌లు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

షోయబ్ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పాపం.. షోయబ్ బలూచిస్థాన్‌ను మర్చిపోయినట్టు ఉన్నాడని కొందరు ఎద్దేవా చేశారు. మొసలి కన్నీరు కార్చడం మాని తొలుత తన దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అయిన షోయబ్ చివరికి తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

పాక్ మాజీ క్రికెటర్లు ఇటీవల భారత్‌పై విషం కక్కడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఇటీవల పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా కశ్మీర్‌పై విషపు రాతలు రాశాడు.  కశ్మీర్‌లో భారత్ రక్తపాతం సృష్టిస్తోందని, స్వీయ నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న అమాయక కశ్మీరీలను పొట్టన పెట్టుకుంటోందని పేర్కొన్నాడు. షోయబ్ ట్వీట్‌పై భారత తాజా, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు.

More Telugu News