Germany: జర్మనీలో మరో ఉగ్రదాడి.. కారుతో జనాలను తొక్కించుకుంటూ పోయిన డ్రైవర్.. నలుగురు దుర్మరణం

  • ఘటన అనంతరం తనను తాను కాల్చేసుకున్న డ్రైవర్
  • ఉగ్ర కోణాన్ని కొట్టిపడేయలేమన్న భద్రతాధికారులు
  • 20 మందికి తీవ్ర గాయాలు
  • ఆరుగురి పరిస్థితి విషమం

జర్మనీలో మరో ఉగ్రదాడి జరిగింది. శనివారం మన్‌స్టర్‌లో ఓ కారు జనాలను తొక్కించుకుంటూ పోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. జనాలను తొక్కించుకుంటూ పోయిన కారు డ్రైవర్ అనంతరం తనను తాను కాల్చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

చారిత్రక డౌన్‌టౌన్ ప్రాంతంలోని కీపెంకెర్ల్ బార్ ఎదుటు జనాలు కూర్చుని ఉండగా వేగంగా వచ్చిన కారు వారిని తొక్కించుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. ఘటనకు పాల్పడిన డ్రైవర్ కారులోనే తనను తాను కాల్చేసుకుని మృతి చెందినట్టు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

కారు డ్రైవర్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతడికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ ఘటన వెనక ఉగ్ర కోణం లేదని చెప్పలేమని భద్రతా దళాలు పేర్కొన్నాయి. కారులో ఓ అనుమానాస్పద వస్తువును కనుగొన్న పోలీసులు, అది ప్రమాదకరమైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకెవరైనా అనుమానితులు ఉన్నారా? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జర్మన్  చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా,  స్టాక్‌హోమ్‌లో జరిగిన ట్రక్కు దాడి శనివారంతో ఏడాది పూర్తైంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అలాగే, డిసెంబరు 2016లో బెర్లిన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News