Davis Cup: వయసు 44, విజయాలు 43... లియాండర్ పేస్ వరల్డ్ రికార్డు!

  • చైనాపై హోరాహోరీ మ్యాచ్ లో విజయం 
  • నికోలా పీట్రంజెలి పేరిట ఉన్న రికార్డు బద్ధలు
  • 28 ఏళ్ల కెరీర్ లో 43 డేవిస్ కప్ విజయాలు
  • గర్వంగా ఉందన్న లియాండర్ పేస్

డేవిస్ కప్ లో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 44 సంవత్సరాల వయసులో భారత్ తరఫున చైనాతో బోపన్నతో కలసి ఆడిన పేస్, హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ గ్రూప్ కు అర్హత సాధించే విషయంలో భారత ఆశలను సజీవంగా నిలపడమే కాకుండా ఇటలీకి చెందిన నికోలా పీట్రంజెలి పేరిట ఉన్న డేవిస్ కప్ అత్యధిక డబుల్స్ విజయాల (42) రికార్డును తిరగరాశాడు. 28 సంవత్సరాల కిందట తన తొలి డేవిడ్ కప్ మ్యాచ్ ఆడిన పేస్, మొత్తం 12 మంది భాగస్వాములతో కలసి ఇండియా తరఫున మ్యాచ్ లు ఆడి 43 విజయాలను సొంతం చేసుకున్నాడు. వీటిల్లో 25 విజయాలు మహేష్ భూపతితో జత కట్టి సాధించినవి కావడం గమనార్హం. ఈ మ్యాచ్ తరువాత లియాండర్ పేస్ మాట్లాడుతూ, వరల్డ్ రికార్డు సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందన్నాడు. ఈ విజయం తనకెంతో ప్రేరణ కలిగిస్తుందని, దీన్ని తన తల్లిదండ్రులకు, కుమార్తెకు, డేవిస్‌ కప్‌ లో తన భాగస్వాములకు, కెప్టెన్లకు అంకితమిస్తున్నట్టు వెల్లడించాడు. తన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని, భారత పౌరుడిగా పుట్టినందుకు, ఇంత సుదీర్ఘ కాలం ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు.

More Telugu News