Salman Khan: సల్మాన్‌కు మరో ఎదురుదెబ్బ.. బదిలీ అయిన న్యాయమూర్తి.. బెయిలు ఆశలు ఆవిరి!

  • నేడు బెయిలు పిటిషన్‌పై విచారణ
  • అంతలోనే జడ్జిని బదిలీ చేసిన హైకోర్టు
  • సల్మాన్ మరిన్ని రోజులు జైల్లోనే..

కృష్ణ జింకల వేట కేసులో జోధ్‌పూర్ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సల్మాన్‌కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. జైలు కెళ్లిన 24 గంటల్లోనే బెయిలు వస్తుందన్న ఆశతో గడిపిన సల్మాన్‌ ఆశ శుక్రవారం నీరుగారిపోయింది.

బెయిలుపై విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం కూడా జైలులోనే గడిపిన కండల వీరుడు శనివారం బెయిలు ఖాయమని ఆశతో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ ఆశ కూడా అడియాస అయింది. సల్మాన్ మరికొన్ని రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. నటుడి బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషీ బదిలీ అయ్యారు. 87 మంది న్యాయమూర్తులతోపాటు రవీంద్ర కుమార్ జోషీని కూడా  ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో సల్మాన్ బెయిలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సల్మాన్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై నేడు విచారణ జరగాల్సి ఉంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న కృష్ణ జింకల వేట కేసులో న్యాయస్థానం గురువారం సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ వెంటనే ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం బెయిలుపై విచారణ జరిపిన కోర్టు దానిని శనివారానికి వాయిదా వేసింది. ఇప్పుడు న్యాయమూర్తి బదిలీ కావడంతో సల్మాన్ బెయిలు సందిగ్ధంలో పడింది.

More Telugu News