Pune: పూణెలో విచిత్రం.. నగర జనాభా కంటే అధికంగా లక్ష వాహనాలు!

  • నగరంలో ఇంటికో వాహనం
  • జనాభా 35 లక్షలు..వాహనాలు 36.2 లక్షలు
  • కష్టంగా మారిన ట్రాఫిక్ నిర్వహణ
  • చేతులెత్తేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

పూణెలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నగరంలో తిరుగుతున్న వాహనాలు జనాభాను మించిపోయాయి. నగర మొత్తం జనాభా  35 లక్షలు కాగా, వాహనాలు 36.2 లక్షలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఓ పట్టణ ప్రాంతంలో ఇలా జరగడం దేశంలో ఇదే తొలిసారి.

2017-18లో నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ 9.57 శాతం పెరగ్గా, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ 8.24 శాతం పెరిగినట్టు రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) అధికారులు తెలిపారు. ఒక్క ట్యాక్సీ క్యాబ్ సెగ్మెంట్‌లోనే అత్యధికంగా 25 శాతం పెరుగుదల నమోదైంది. 2016-17లో 22,696 ట్యాక్సీలు రిజిస్టర్ కాగా, తాజాగా వాటి సంఖ్య 28,344కు చేరుకుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. ఈ సంఖ్య  కేవలం రిజిస్టర్ అయిన వాహనాలది మాత్రమే.

ఇక ద్విచక్ర వాహనాల విషయంలో పూణె హవా కొనసాగుతోంది. గతేడాది 24.97 లక్షల వాహనాలు ఉండగా, ఈసారి అది 27.03 లక్షలకు చేరుకుంది. అలాగే కార్ల సంఖ్య కూడా 6.45 లక్షలకు చేరుకుంది. దీనిని బట్టి చూస్తే నగరంలోని ప్రతీ ఇంటికీ ఓ వాహనం ఉన్నట్టేనని అధికారులు తెలిపారు. కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

పెరిగిన వాహనాల కారణంగా నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, ట్రాఫిక్ నిర్వహణ కష్టంగా మారిందని ఆర్టీవో చీఫ్ అజ్రి పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా తార స్థాయికి చేరినట్టు చెప్పారు.

More Telugu News