Karnataka: సిద్ధరామయ్య, దేవెగౌడ మధ్య రహస్య ఒప్పందం?

  • గతవారం నేతలిద్దరూ రహస్య భేటీ
  • ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకుంటే కలిసి ప్రభుత్వ ఏర్పాటు
  • జేడీఎస్‌కు 50 సీట్లకు మించితే ముఖ్యమంత్రి పదవి?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జనతాదళ్-ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు వస్తున్న వార్తలు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరూ రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న కారణంగా జేడీఎస్‌తో కలిసి ఎదుర్కోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. జేడీఎస్‌తో రహస్యంగా ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.

గత వారం సిద్ధరామయ్య-దేవెగౌడలు రహస్యంగా సమావేశం అయినట్టు సమాచారం. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని, ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకుంటే  రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

జేడీఎస్‌కు 50 సీట్లు దాటితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న దేవెగౌడ ప్రతిపాదనకు సిద్ధ రామయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. 50 సీట్లకు తగ్గినా కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధరామయ్య అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, దేవెగౌడతో భేటీ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సిద్ధ రామయ్య ముందుగానే చెప్పినట్టు సమాచారం.

More Telugu News