Telugudesam: వాయిదా పడినా సభను వీడని టీడీపీ ఎంపీలు... స్పీకర్ పిలుస్తున్నారని చెప్పి, లాబీ తలుపుల మూసివేత!

  • సభను వీడకుండా నినాదాలు చేసిన ఎంపీలు
  • హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్
  • తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడతానన్న సుమిత్రా మహాజన్
  • నమ్మి బయటకు రాగానే తలుపుల మూసివేత

ఈ మధ్యాహ్నం లోక్ సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సభను వీడని తెలుగుదేశం పార్టీ ఎంపీలు, నిన్న నిరసనలు తెలిపిన విధంగానే నేడు కూడా సభలో నినాదాలు చేస్తూ కూర్చుండిపోయారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.

 దీంతో వారిని స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుస్తున్నారని, ఆమె చాంబర్ కు వచ్చి చర్చించాలని ఎంపీల వద్దకు వచ్చిన అధికారులు వెల్లడించారు. దీంతో వారంతా బయటకు రాగానే, మరోసారి లోనికి వెళ్లకుండా లోక్ సభ లాబీ తలుపులను అధికారులు మూసివేయించారు. ఆపై టీడీపీ ఎంపీలు సుమిత్రా మహాజన్ కార్యాలయం వద్దకు వెళ్లేసరికి ఆమె వెళ్లిపోవడంతో, తాము మోసపోయామని గ్రహించి, స్పీకర్ చాంబర్ ముందు తెలుగుదేశం ఎంపీలు నిరసనలకు దిగారు. 

More Telugu News