Punjab: ఐపీఎల్‌లో ఖలిస్థాన్ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు కుట్ర.. నలుగురు ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్థాన్ ఉగ్రవాదుల అరెస్ట్!

  • మొహాలీలో ఖలిస్థాన్‌ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక
  • మలేసియా నుంచి నడిపిస్తున్న దీప్‌కౌర్
  • పంజాబ్ ఆర్టీసీ బస్సులు, వైన్ షాపులను తగలబెట్టాలన్న ఆదేశాలు

పంజాబ్‌లోని మొహాలీలో జరగనున్న ఐపీఎల్ మ్యాచుల్లో ఖలిస్థాన్ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రణాళిక రచించిన నలుగురు ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్థాన్ ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. ఉగ్రవాదులను నవన్‌షహార్‌లోని ఖనఖానా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ‘రెఫరెండం 2020’ పేరుతో పేస్‌బుక్‌లో ప్రచారం చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐ సాయం చేస్తున్న ఖలిస్థాన్ గ్రూపులు వీరికి మద్దతు ఇస్తున్నాయి.  

మలేసియాలో ఉంటున్న దీప్ కౌర్ అలియాస్ కుల్బిర్ కౌర్ వీరి వెనక ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తప్పుడు ప్రొఫైల్స్‌తో ఫేస్‌బుక్ ఖాతాలతోపాటు వాట్సాప్‌ గ్రూపులను సృష్టించి నిరుద్యోగ పంజాబీ యువతను దీప్‌కౌర్ తనవైపు తిప్పుకుంటున్నాడు. పంజాబ్ ఆర్టీసీ బస్సులను, వైన్‌షాపులను దహనం చేయాలన్న ఆదేశాలు వీరికి అందాయని పోలీసులు తెలిపారు. అలాగే ‘రెఫరెండం 2020’ పేరుతో ఐపీఎల్ మ్యాచులు జరిగే మొహాలీ క్రికెట్ స్టేడియం బయట వాల్‌పోస్టర్లు అంటించి ఖలిస్థాన్ అంశాన్ని తెరపైకి తీసుకురావాలని పథకం పన్నినట్టు పోలీసులు వివరించారు. కాగా, నిందితుడు దీప్ కౌర్ వీరికి ఇప్పటికే రూ.70 వేలు అందించినట్టు తెలిపారు.

More Telugu News