Salman Khan: బెయిలు వస్తుందన్న ఆశతో రాత్రంతా గడిపిన సల్మాన్.. జైలులో తొలి రాత్రి గడిచిందిలా..!

  • 24 గంటల్లో బెయిలు వస్తుందన్న ఆశలో సల్మాన్
  • సాధారణ ఖైదీలానే ట్రీట్ చేస్తున్న జైలు సిబ్బంది
  • ఓ చెక్క మంచం, నాలుగు దుప్పట్లు

కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలి జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు చేరుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తొలి రాత్రిని బెయిలు వస్తుందన్న ఆశతో గడిపాడు. జైలులో అతడికి ఓ చెక్కమంచం, నాలుగు దుప్పట్లను అధికారులు అందించారు. రాత్రి ఆయన ఆ మంచంపైనే నిద్రించినట్టు అధికారులు తెలిపారు.

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల తర్వాత జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ను గురువారం దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులు సైఫ్ అలీఖాన్, టబు నీలమ్, సోనాలి బింద్రేలు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు సల్మాన్ ను పోలీసు వాహనంలో జైలుకు తరలించారు. సల్మాన్‌కు శిక్ష పడడంతో అతడి అభిమానులు కన్నీరు పెట్టుకుంటుండగా, జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జైలుకు చేరుకున్న సల్మాన్‌కు ఆయన మేనేజర్ హోటల్ తాజ్ నుంచి ఆహారం, దుస్తులు తెచ్చి ఇచ్చినట్టు వచ్చిన వార్తలను జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కొట్టిపడేశారు. అతడు వాటిని తెచ్చిన మాట వాస్తవమే అయినా దుస్తులు మాత్రమే తీసుకుని తినుబండారాలను వెనక్కి పంపినట్టు తెలిపారు. జైలులో సల్మాన్‌కు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తేల్చి చెప్పారు. జైలుకు వచ్చినప్పుడు అతడికి రక్తపోటు ఉందని, ప్రస్తుతం అది సాధారణ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు.

ప్రస్తుతానికి సల్మాన్ నీళ్లు తప్ప ఏమీ తీసుకోవడం లేదని విక్రమ్ సింగ్ తెలిపారు. జైలు మెనూ ప్రకారం రాత్రికి భోజనంలోకి చనా పప్పు, క్యాబేజీ అందించినట్టు చెప్పారు. ఈ ఉదయం అందరితో పాటు బ్రేక్‌ఫాస్ట్, టీ, తర్వాత కిచిడీ ఇవ్వనున్నట్టు చెప్పారు.

More Telugu News