ipl: రాత్రుళ్లు వాచ్ మన్.. పగలు క్రికెట్ ప్రాక్టీస్!: ఐపీఎల్ ఆటగాడి ఆసక్తకర జీవితం

  • పేద కుటుంబం నుంచి వచ్చిన మంజూర్ దార్
  • తండ్రికి చేదోడుగా ఉండేందుకు వాచ్ మన్ గా పని
  • సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించడంతో ఐపీఎల్ లో చోటు

'గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, ఆకలేస్తే కన్నీళ్లు మింగి బతికాం' అన్న సినిమా డైలాగ్ ఐపీఏల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంజూర్ దార్ కు అతికినట్టు సరిపోతుంది. మంజూర్ దార్ జమ్మూకశ్మీర్‌ లోని బందిపూరా జిల్లాలో కనీస సదుపాయాలు లేని మారుమూల గ్రామీణ యువకుడు. చిన్నప్పటి నుంచి మంజూర్ దార్ కి క్రికెట్ అంటే ఎనలేని మక్కువ. ఆ పరిసరాల్లో ఎక్కడ క్రికెట్ జరిగినా తను ఉండాల్సిందే. అలా మొదలైన అతని క్రికెట్‌ ప్రస్థానం, 2016-17లో అంతర్రాష్ట్ర టీ20 టోర్నమెంట్‌ లో జమ్మూ కశ్మీర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవరకు వెళ్లింది.

 గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించడంతో మంజూర్ దార్ దశ తిరిగింది. జమ్మూకశ్మీర్‌ తరఫున ఈ ఏడాది ఐపీఎల్‌ కు ఎంపికైన ఏకైక ఆటగాడు, ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ కు ఆడుతున్న రెండో ఆటగాడు కూడా మంజూర్‌ దారే కావడం విశేషం. అతని కంటే ముందు పర్వేజ్‌ రసూల్‌ ఐపీఎల్‌ లో ఆడాడు.

మంజూర్‌ తల్లిదండ్రులకు 8 మంది సంతానం, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు, వారందర్లోకీ మంజూర్ దారే పెద్దవాడు. దీంతో చిన్ననాటి నుంచే తండ్రికి అన్నింటా సహాయపడేవాడు. కుటుంబం పెద్దది కావడంతో కొన్ని సార్లు కనీసం తినేందుకు సరైన తిండి కూడా లభించేది కాదని చెప్పాడు. చెల్లెళ్లైతే ఆకలికి తట్టుకోలేక అక్కడ దొరికే ఆపిల్స్ తిని నిద్రపోయేవారన్నాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాచ్‌ మెన్‌ గా చేరాడు. రాత్రుళ్లు వాచ్‌ మెన్‌ డ్యూటీ చేస్తూ, పగలు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడినని మంజూర్ దార్ తెలిపాడు. దీంతో లోకల్ జట్టుకు ఆడే అవకాశం వచ్చిందని అన్నాడు.

ఆ తరువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. నెమ్మదిగా రాష్ట్ర జట్టుకు ఆడడంతో దశ తిరిగింది. ఐపీఎల్‌ లో 20 లక్షల రూపాయలకు కింగ్స్ ఎలెవన్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు తొమ్మిది టీ20 మ్యాచ్‌ లాడిన మంజూర్‌ 145 స్ట్రైక్‌ రేట్‌ తో పరుగులు సాధించడం విశేషం. దీంతో తన కుటుంబ పరిస్థితి మెరుగుపడిందని, పేదరికం కారణంగా ఆగిన చదువును మళ్లీ కొనసాగిస్తున్నానని, ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలు రాశానని మంజూర్ దార్ తెలిపాడు. ఐపీఎల్ లో ఆడేందుకు హెలికాప్టర్ షాట్ ను తీవ్రంగా ప్రయత్నించానని మంజూర్ దార్ తెలిపాడు. ఈ సారి ఎలాగైనా ఆ షాట్ ఆడుతానని ధీమాగా చెప్పాడు.

More Telugu News