stock markets: మళ్లీ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... 320 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

  • అమెరికా-చైనాల మధ్య పెరిగిన వాణిజ్య ఘర్షణలు
  • అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించిన చైనా
  • దీంతో అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలతో మరోసారి వణికిపోయాయి. మధ్యాహ్నం వరకూ మార్కెట్లు బాగానే ఉన్నాయనకున్నప్పటికీ... 12.30 గంటల తర్వాత వెల్లువెత్తిన అమ్మకాలకు సెన్సెక్స్ పతనం ఆరంభమైంది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 33,067 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు గరిష్టం నుంచి చూసుకుంటే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కాస్తంత ఉపశమించిందని భావిస్తున్న తరుణంలో... చైనా తీసుకున్న తాజా నిర్ణయంతో మళ్లీ ఆందోళనలు పెరిగిపోయాయి.

ఇటీవలే చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయం విదితమే. తాము సైతం సుంకాలు పెంచుతామంటూ చైనా హెచ్చరించింది. అందులో భాగంగానే తాజాగా అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అయ్యే 106 ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య పోరు మరింత ముదురుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్లలో నష్టాలకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 103 పాయింట్ల నష్టంతో 10,141 వద్ద ట్రేడవుతోంది.

More Telugu News