macherla: మాచర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతున్న ఫేస్ బుక్ పోస్ట్!

  • 2019లో పిన్నెల్లికి వైసీపీ టికెట్ రాదు
  • పిన్నెల్లి ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది
  • పెన్నెల్లిపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారంటూ పోస్ట్

ఓ టీడీపీ మద్దతుదారుడు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ మాచర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. మాచర్ల వైసీీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2019లో టికెట్ రాదని, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో పిన్నెల్లి ఓడిపోతారని తేలిందని టీడీపీ ఇన్ ఛార్జ్ చలమారెడ్డి సన్నిహితుడు బ్రహ్మారెడ్డి పోస్ట్ చేశారు. పిన్నెల్లిపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని... మరో సామాజికవర్గ నేతకు టికెట్ ఇచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ తర్వాత అక్కడ రాజకీయ దుమారం రేగింది.

మరోవైపు, పిన్నెల్లి తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఫోన్ ద్వారా తనను చంపుతానంటూ బెదిరించారని మాచర్ల అర్బన్ సీఐకు బ్రహ్మారెడ్డి తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. తమ వద్ద వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని చెప్పారు. దీనిపై పిన్నెల్లి స్పందిస్తూ, చంపుతానని తాను బెదిరించినట్టు రుజువు చేస్తే కేసు పెట్టుకోవచ్చని చెప్పారు.

ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐని కలిశారు. రెండు దశాబ్దాల పాటు వీరారెడ్డి తన వద్దే ఉన్నాడని, ఆ తర్వాత పార్టీ మారారని సీఐకి తెలిపారు. తనపై పోస్ట్ పెట్టిన బ్రహ్మారెడ్డికి ఫోన్ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందనే భావనతో... ఒకప్పుడు తనతో చనువుగా ఉన్న అతని తండ్రి వీరారెడ్డికి ఫోన్ చేశానని... ఇలాంటివి అనవసరమని మాత్రమే అన్నానని పిన్నెల్లి చెప్పారు. 

More Telugu News