Telangana: జూలై చివరకు శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా నీళ్లందిస్తాం : మంత్రి హరీశ్ రావు

  • అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం ఇది
  • ఈ జలాశయానికి పునర్ వైభవం కల్పిస్తాం
  • అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. జగిత్యాల ప్రాంతంలో హెలికాప్టర్ లో ఈరోజు ఆయన పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని, రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను మళ్ళించి, ఈ జలాశయానికి పునర్ వైభవం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్  పునరుజ్జీవన పథకమని, జూలై చివరి నాటికి ఈ రిజర్వాయర్ నుంచి నీరందించాలనేది తమ లక్ష్యమని అన్నారు.

కాకతీయ కాలువ, వరదకాలువల మధ్య పలు ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలకు నీరందిస్తామని, మోతే రిజర్వాయర్ కు పునరుజ్జీవన పథకం గ్రావిటీ కెనాల్  ద్వారా నీరిస్తామని చెప్పారు. మోతే గ్రామం ముంపునకు గురికాకుండానే సాగునీరందించనున్నామని, కొత్తగా 11 ఓటీలు ఇప్పటికే మంజూరు చేశామని, మరో 9 ఓటీలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. వీటిని 4 మీటర్ల ఎత్తులో పెడుతున్నామని, తద్వారా వరద కాలువ కింద వీలైనంత చెరువులు నింపుతామని   వివరించారు.

అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎగువ భాగంలో మహారాష్ట్ర చాలా ప్రాజెక్టులు కడుతోందని, రైతులు వర్షం కోసం ఎదురు చూడాల్సిన పని లేదని, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పధకం ద్వారా 12.45 లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి , నిర్మల్ జిల్లాల రైతాంగానికి  ప్రయోజనం కలగనుందని అన్నారు.జూలై 31 నాటికి అర టీఎంసీ నీటిని తరలించే విధంగా పని చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితం జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతాంగానికి దక్కుతుందని అన్నారు. కాగా, సబ్ స్టేషన్ నిర్మాణాన్ని కూడా జూలై నెలాఖరుకు పూర్తి కావాలని అధికారులను,119 విద్యుత్ టవర్లను నిర్మించాలని, ఇకపై ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మిడ్ మానేరు, మూల వాగుపై 20 చెక్ డ్యాం లను రూ.150 కోట్లతో  మంజూరు చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈ రెండు నదులు పూర్తిగా పునరుజ్జీవనం పొందుతాయన్నారు. పాత కరీంనగర్ జిల్లా ఒకనాడు కల్లోలసీమగా ఉండేదని, దానిని కోనసీమను తలపించే రీతిలో మార్చుతామని చెప్పారు. వివిధ జలాశయాల నిర్మాణం వల్ల పూర్వ కరీంనగర్  జిల్లాలో 100 టీఎంసీలు నిల్వ ఉంటాయని తెలిపారు.
 ప్రతిపక్షం చేసే ప్రయత్నాలు ఫలించవు  
 

సాగునీటి  ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ కాల్వలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ఎస్సారెస్సీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీరని అన్యాయం జరిగిందని, ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన శ్రీ రాంసాగర్  ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా మారుస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని అయిన ‘శ్రీరాంసాగర్’ పై ఆధారపడి ఎంతో ఆయకట్టు, ఎన్నో పథకాలు ఉన్నాయని, వీటన్నింటికి మొత్తం మీద అవసరమయ్యే నీరు 95 టీఎంసీలు కాగా, ఆధారపడిన ఆయకట్టు 9.73 లక్షల ఎకరాలని తెలిపారు.  

More Telugu News