cbse exam: సీబీఎస్ఈ పదో తరగతి మ్యాథ్స్ పరీక్ష ఇక లేనట్టే!

  • మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ధారణ
  • త్వరలో దీనిపై వెలువడనున్న ప్రకటన
  • 16 లక్షల మంది విద్యార్థులకు ఊరట
  • పరీక్షలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కాస్తంత ఊరట. పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను మరోసారి నిర్వహించే అవకాశాల్లేవని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు అందించిన సమాచారం. ఇటీవల జరిగిన పరీక్షల్లో పదో తరగతి మ్యాథ్స్, పన్నెండో తరగతి ఎకనమిక్స్ పేపర్లు లీక్ అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. దీనిపై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు.

ఎకనమిక్స్ పేపర్ ను ఈ నెల 25న తిరిగి నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటన కూడా జారీ చేసింది. మ్యాథ్స్ పరీక్షను మాత్రం అవసరమనుకుంటే ఈ ఏడాది జూలైలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే, తగిన పరిశీలన అనంతరం తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చినట్టు మానవవనరుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

దీంతో 16 లక్షల మంది విద్యార్థులు మరోసారి కష్టపడి పరీక్షరాసే శ్రమ తప్పినట్టు అయింది. దీనిపై త్వరలోనే ప్రకటన జారీ కానుంది. మరోవైపు సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్, పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలను తిరిగి నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. 

More Telugu News