Cricket: క్యాచ్ అంటే ఇదీ... వీడియో చూడండి!

  • నాలుగో టెస్టులో అద్భుతమైన క్యాచ్ పట్టిన డీన్ ఎల్గర్
  • రబడా బౌలింగ్ లో భారీ షాట్ ఆడే యత్నం చేసిన పైన్
  • అమాంతం గాల్లోకి లేచి బంతిని ఒడిసి పట్టిన ఎల్గర్

టెస్టు క్రికెట్‌ లో సఫారీ ఆటగాడు డీన్ ఎల్గర్ పట్టిన క్యాచ్ ను సోషల్ మీడియాలో అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తునారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అద్భుతమైన క్యాచ్ అని పేర్కొంటున్నారు. ఈ క్యాచ్ వివరాల్లోకి వెళ్తే... సఫారీలతో ఆసీస్ ఆటగాళ్లు నాలుగోటెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య ప్రోటీస్ 488 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ వడివడిగా వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ల స్థానంలో వచ్చిన ఆటగాళ్లు సఫారీలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో జట్టు భారాన్ని కెప్టెన్‌ టిమ్‌ ఫైన్‌, పాట్‌ కమిన్స్‌ మోసే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పాట్‌ కమిన్స్‌ 50 (92బంతుల్లో) అర్ధశతకం సాధించిన అనంతరం 62వ ఓవర్‌ లో మహరాజ్‌ బౌలింగ్‌ లో ఎల్బీడబ్య్లూగా పెవిలియన్ చేరాడు. అప్పటికి ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 195 పరుగులు చేసింది. అనంతరం ఒంటరిపోరాటం చేసిన పైన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడా వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. దీనిని ఆపేందుకు పరుగెత్తిన ఎల్గర్ మెరుపు వేగంతో అమాంతం గాల్లోకి లేచి బంతిని ఒడిసిపట్టాడు.  దీంతో 221 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా బంతిని క్యాచ్ పట్టేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి.  

More Telugu News