Cricket: బాల్ టాంపరింగ్ వివాదానికి కారణాన్ని వెల్లడించిన వార్నర్ భార్య!

  • తొలి టెస్టులో వార్నర్ భార్యపై విమర్శలు చేసిన డికాక్
  • ఆగ్రహానికి గురై డికాక్ తో వాగ్వాదానికి దిగిన వార్నర్
  • ఎలాగైనా గెలవాలన్న కసితోనే టాంపరింగ్

ఆస్రేలియా ఆటగాళ్ల ప్రతిష్ఠను దెబ్బతీసిన బాల్‌ టాంపరింగ్‌ వివాదానికి కారణాన్ని ఆసీస్ మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భార్య కాండైస్ వివరించింది. 'సిడ్నీ సండే టెలిగ్రాఫ్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదంపై వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.... మొదటి టెస్టులో స్లెడ్జింగ్ లో భాగంగా సఫారీ ఆటగాడు క్వింటన్ డికాక్ తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడని తెలిపింది.

 దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుందని, తర్వాత ఈ వివాదం డ్రెస్సింగ్ రూం వరకు వెళ్లిందని తెలిపింది. తరువాతి రోజు ఆట సందర్భంగా పలువురు సఫారీ అభిమానులు రగ్బీ ఆటగాడు సోనీ బిల్‌ విలియమ్స్‌ ఫేస్‌ మాస్క్‌ లు ధరించి మైదానంలో వార్నర్‌ ను రెచ్చగొట్టారని కాండైస్‌ తెలిపింది. వార్నర్ తో వివాహానికి ముందు తనకు సోనీ విలియమ్స్ తో అఫైర్ ఉందనే అర్థం వచ్చేలా వారామాస్కులు ధరించారని, దీంతో వార్నర్‌ తనను తాను అదుపు చేసుకోలేకపోయాడని చెప్పింది.

దానికి తోడు అప్పటికే వచ్చిన విమర్శల నేపథ్యంలో మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలన్న కసితో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని తెలిపింది. దీనికి తాను తన భర్తను వెనుకేసుకు రావడం లేదని, తన కుటుంబంపై ప్రేమతోనే అలా చేశాడని కాండైస్ పేర్కొంది. దీనిని అధిగమించేందుకు తన భర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, అతని పట్ల సానుభూతి, సహనం చూపించాలని ఆమె ఆసీస్ అభిమానులను కోరింది.

More Telugu News