Sachin Tendulkar: పెద్ద మనసును చాటుకున్న సచిన్ టెండూల్కర్...... ప్రశంసించిన ప్రధాని!

  • ఎంపీగా పొందిన ఆరేళ్ల జీతభత్యాలు ప్రధాని సహాయనిధికి అందజేత
  • ప్రధానమంత్రి కృతజ్ఞతలతో పీఎంవో ప్రకటన విడుదల
  • పదవీకాలంలో రూ.7.4 కోట్ల విలువైన 185 ప్రాజెక్టులను మంజూరు చేసిన సచిన్

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసును చాటుకున్నారు. రాజ్యసభ సభ్యుడుగా ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఎంపీగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా అందజేశారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదలయింది.

 "ఈ ఆలోచనా పూర్వకమైన సంకేతాన్ని ప్రధానమంత్రి గుర్తించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విరాళాలు దీనావస్థలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి" అంటూ పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సచిన్ రాజ్యసభ సభ్యుడుగా ప్రభుత్వం కేటాయించిన రూ.30 కోట్ల నిధుల్లో దేశవ్యాప్తంగా రూ.7.4 కోట్ల విలువైన 185 ప్రాజెక్టులను మంజూరు చేశారని ఆయన కార్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది. కాగా, సన్సద్ గ్రామ్ ఆదర్శ్ గ్రామ్ యోజనా పథకం కింద టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని దోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News