Chief Justis: సంచలన నిర్ణయం... చీఫ్ జస్టిస్ ముందు ఏ కేసూ వాదించకుండా సిబల్, మను సంఘ్వీ, వివేక్ లపై నిషేధం!

  • దీపక్ మిశ్రాను అభిశంసించే ఆలోచనలో కాంగ్రెస్
  • కాంగ్రెస్ న్యాయవాదులు ఆయన విచారించే కేసులకు రారాదు
  • బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ నేతలు, దేశంలో ప్రముఖ న్యాయవాదులుగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సహా అభిషేక్ మనూ సంఘ్వి, వివేత్ తన్ఖాలను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విచారించే ఏ కేసులోనూ వాదించకుండా బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ మిశ్రా వెల్లడించారు.

 ప్రజా ప్రతినిధులు కోర్టుల్లో తమ ప్రాక్టీస్ ను కొనసాగించకుండా ఆపేందుకు తమకు హక్కు లేదని, అయితే, ఈ కేసు ప్రత్యేకమైనదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని పట్టుబడుతున్నవారు, ఆయన ముందు కేసులను ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ లోని అత్యధికులతో చర్చించిన మీదటే, వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై సిబల్, సంఘ్వీ, తన్ఖాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తమను ఏ కోర్టుకూ రాకుండా, వాదనలు వినిపించకుండా చేసే హక్కు బార్ కౌన్సిల్ కు లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News