Australia: ఆస్ట్రేలియాను శాశ్వతంగా వదిలేసిన స్టీవ్ స్మిత్!

  • బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన స్మిత్
  • మీడియా సమావేశం తరువాత దుబాయ్ కి పయనం
  • క్రికెట్ సరంజామానంతా వెంటేసుకుని వెళ్లిన మాజీ కెప్టెన్
  • దుబాయ్ లో అకాడమీని ప్రారంభించే ఆలోచన!

క్రికెట్ లో ప్రత్యర్థి జట్టుపై విజయం కోసం బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి ఆస్ట్రేలియా పరువును నడివీధిలో నిలిపిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, శాశ్వతంగా తన స్వదేశాన్ని వీడాడా? అవుననే అంటున్నాయి ఆస్ట్రేలియా పత్రికలు. ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న తరువాత సౌతాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్, ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, తాను తప్పు చేసినట్టు అంగీకరించడంతో పాటు, క్షమించాలని వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆపై గంటల వ్యవధిలోనే స్మిత్ దుబాయ్ విమానం ఎక్కేశాడు.

తన ఆటకు, క్రికెట్ కు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నింటినీ ఆయన దుబాయ్ కి తీసుకెళ్లిపోవడం గమనార్హం. తాను భవిష్యత్తులో దుబాయ్ లో క్రికెట్ అకాడమీని నెలకొల్పుతానని గతంలోనే వెల్లడించిన స్మిత్, ఆ కోరికను ఇప్పుడు తీర్చుకోనున్నాడని పలు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలు రాశాయి. స్మిత్ ను ఆస్ట్రేలియాలో చూసేది కష్టమేనని అభిప్రాయపడ్డాయి. అతనిపై నిషేధం ఏడాదిపాటే ఉన్నప్పటికీ, ఆ తరువాతైనా తాను ఆస్ట్రేలియా జట్టుకు ఆడేది అనుమానమేనన్న అంచనాతోనే స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ లో అకాడమీకి సంబంధించిన సమాచారాన్ని స్మిత్ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News