ఐపీఎల్ : వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్

31-03-2018 Sat 16:11
  • వార్నర్ స్థానంలో హేల్స్‌ని తీసుకున్నట్లు సన్ రైజర్స్ ప్రకటన
  • జనవరి వేలంపాటలో హేల్స్‌కి కరువైన ఆదరణ
  • ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం
ఏప్రిల్ 7 నుంచి జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం 'సన్ రైజర్స్ హైదరాబాద్' ఫ్రాంచైజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్‌ను ఎంపిక చేసుకుంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో వార్నర్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు నిషేధించడంతో సన్ రైజర్స్ కెప్టెన్‌ పదవి నుంచి అతను తప్పుకున్నాడు. దాంతో అతని స్థానంలో తొలుత శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరాను సదరు ఫ్రాంచైజీ సంప్రదించగా అతను 'నో' చెప్పినట్లు వార్తలొచ్చాయి.

ఇప్పుడు హేల్స్‌ని ఎంపిక చేసుకున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. "ప్రపంచంలోనే అతిపెద్ద దేశవాళీ టోర్నీ అయిన ఐపీఎల్‌లో ఆడే అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది" అని హేల్స్ అన్నాడు. కాగా, జనవరిలో ఐపీఎల్ వేలంపాట నిర్వహించినపుడు అతన్ని ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనుక్కోలేదు. ఫలితంగా 2019 సీజన్ ముగింపు వరకు నాటింగ్‌హ్యామ్‌షైర్ తరపున ట్వంటీ-20 టోర్నీలు ఆడేందుకు అతను గతనెల ఒప్పందం కుదుర్చుకున్నాడు.