ఐపీఎల్‌ ఆఫర్‌ను తిరస్కరించిన లంక క్రికెటర్....!

31-03-2018 Sat 14:48
  • డేవిడ్ వార్నర్ స్థానంలో తీసుకునేందుకు సన్ రైజర్స్ ప్రయత్నాలు
  • సన్ రైజర్స్ ఆఫర్‌ను తిరస్కరించిన కుశాల్ పెరీరా
  • దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకేనట!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో ఆడే అవకాశం వస్తే ఏ క్రికెటర్ అయినా సరే ఎగిరి గంతేస్తాడు. కానీ, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా మాత్రం అలాంటి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడట. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు కుశాల్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సంప్రదించింది. కానీ, ఐపీఎల్‌లో ఆడలేనని అతను తేల్చిచెప్పేశాడట. ఐపీఎల్ సమయంలోనే దేశవాళీ క్రికెట్‌లో ఆడి తిరిగి లంక టెస్టు జట్టులో చోటు సంపాదించుకోవాలన్న పట్టుదలతోనే కుశాల్ ఈ ఆఫర్‌కు ఒప్పుకోలేదట.

ఈ విషయాన్ని లంకలోని ఐలాండ్ క్రికెట్ వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్ డానియల్ అలెగ్జాండర్ ధ్రువీకరించారు. అందరూ తక్కువ కాలంలో ఎక్కువ పైసలు కుమ్మరించే ఐపీఎల్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటే కుశాల్ మాత్రం ఇలా చేయడంపై పలువురు విమర్శిస్తుండగా..మరికొందరు మాత్రం అంతర్జాతీయంగా తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ ఏప్రిల్ 7 నుంచి మొదలవుతుంది.