icici bank: ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక విచారణ

  • చందా కొచ్చర్ అవినీతి ఆరోపణలపై దృష్టి
  • వీడియోకాన్ గ్రూపునకు భారీగా రుణమిచ్చి ప్రతిఫలం పొందినట్టు ఆరోపణలు
  • వీటిని ఇప్పటికే ఖండించిన ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్ మధ్య అనుబంధంపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. వీడియోకాన్ గ్రూపునకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు రూ.3,250 కోట్ల రుణాలను మంజూరు చేసింది.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ధూత్, దీపక్ కొచ్చర్ భాగస్వామ్యంతో తాను నిర్వహిస్తున్న ఓ కంపెనీలోకి  రూ.60 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసి వాటాలు తీసుకున్నారు. ఆ తర్వాత లక్షలాది రూపాయలకే ఆ వాటాలను దీపక్ కొచ్చర్ పరం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తమకు లభించిన రుణానికి బహుమానంగానే ధూత్ ఈ నిధుల్ని పరోక్షంగా చందాకొచ్చర్ భర్తకు సమర్పించుకున్నారని వార్తలు వచ్చాయి.

దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలెంత అన్నది ప్రాథమిక విచారణలో సీబీఐ దృష్టి పెట్టనుంది. అయితే, వీడియోకాన్ గ్రూపు చమురు వ్యాపారం కోసం రూ.40,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు 20 బ్యాంకుల కన్సార్టియం ఆమోదం తెలుపగా, అందులో తమ వాటా రూ.3,250 కోట్లు అని, ఇందులో చందాకొచ్చర్ లాలూచీ ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు సెబీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఏవైనా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయా? అన్న దానిపై విచారణ మొదలు పెట్టింది.

More Telugu News