Arnold Schwarzenegger: అర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ కు అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ

  • లాస్ ఏంజెలెస్ లో ఆర్నాల్డ్ కు అత్యవసర సర్జరీ
  • పాత పుల్మోనిక్ వాల్వ్ తొలగింపు.. కొత్త వాల్వ్ అమరిక 
  • సర్జరీ తర్వాత 'అయాం బ్యాక్' అన్న అర్నాల్డ్

హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ కు అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. లాస్ ఏంజెలెస్ లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ లో నిన్న సర్జరీ జరిగింది. 1997లో ఆయన గుండెకు ఓసారి సర్జరీ జరిగింది. అయితే, తిరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో... ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీని నిర్వహించారు.

తాజా సర్జరీలో 1997లో ఆయనకు అమర్చిన పుల్మోనిక్ వాల్వ్ ను తొలగించి, ఆ స్థానంలో కొత్త వాల్వ్ ను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ మాట్లాడుతూ, 1997లో అమర్చిన వాల్వ్ కాలపరిమితి ముగిసిందని... ఈ నేపథ్యంలో దాన్ని రీప్లేస్ చేయించుకునేందుకు అర్నాల్డ్ మొగ్గు చూపారని తెలిపారు. ఎంతో కీలకమైన ఈ భాగాన్ని విజయవంతంగా అమర్చారని అన్నారు. 70 ఏళ్ల ఈ 'టెర్మినేటర్' హీరో ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.

మరోవైపు, సర్జరీ తర్వాత తొలిసారి ఆయన మాట్లాడుతూ, 'అయాం బ్యాక్' అని అన్నారు. 2003 నుంచి 2011 వరకు ఆయన కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా పదవీ బాధ్యతలను నిర్వహించారు. 

More Telugu News