David Warner: మీడియా సమావేశంలో వలవలా ఏడ్చేసిన వార్నర్.. ఇక ఆసీస్‌కు ఆడలేనని వ్యాఖ్య!

  • మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన వార్నర్
  • దేశానికి తలవంపులు తీసుకొచ్చినందుకు క్షమాపణలు
  • బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఏడాది నిషేధం

బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 12 నెలల నిషేధం తర్వాత ఇక తాను ఆస్ట్రేలియాకు ఆడలేనేమోనని కన్నీరు పొంగుకొస్తుండగా చెప్పాడు. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు క్షమాపణలు చెప్పిన వార్నర్ మీడియా సమవేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదివి వినిపిస్తూ ఒక్కసారిగా వలవలా ఏడ్చేశాడు. తాను క్షమించరాని నేరం చేశానని అంగీకరించాడు. ఏదో ఒకరోజు తాను తిరిగి దేశం కోసం ఆడతానన్న ఆశ ఏదో మూల ఉందంటూనే.. ఆ అవకాశం లేదన్న చేదు నిజం తనకు తెలుసన్నాడు. తాను ఈ తప్పిదానికి ఎలా పాల్పడ్డానన్న విషయాన్ని వచ్చే రోజుల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటానన్నాడు. అసలు వ్యక్తిగా తానెవరినన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వివరించాడు. దేశానికి తాము తలవంపులు తీసుకొచ్చామని, ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు.

బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. గురువారం మీడియాతో మాట్లాడుతూ స్మిత్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. టాంపరింగ్‌కు పాల్పడిన బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ 9 నెలల నిషేధానికి గురయ్యాడు.

More Telugu News