Pakistan: ఫేస్ బుక్ లో అమ్మాయితో వల... పాక్ గూఢచారిగా మారిన అమృతసర్ యువకుడు!

  • అందమైన అమ్మాయిలను చూపిస్తున్న పాక్
  • తప్పుడు ఫేస్ బుక్ ఖాతాలతో భారత యువకులకు వల
  • ఐఎస్ఐ వలలో పడి గూఢచారిగా మారిన రవికుమార్
  • అరెస్ట్ చేసిన పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

డబ్బు, అందమైన అమ్మాయిలను ఆశగా చూపించి ఇండియా యువకులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్న పాక్ కుటిల పన్నాగాన్ని భారత్ మరోసారి తిప్పికొట్టింది. అమృతసర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడిని, ఫేస్ బుక్ ద్వారా లోబరచుకున్న పాక్ ఐఎస్ఐ, అతన్ని భారత్ లో గూఢచారిగా నియమించుకోగా, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దాదాపు ఏడు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కాగా, ఆమెపై మోహంతో ఐఎస్ఐకి రిక్రూట్ అయిన రవికుమార్, పంజాబ్ లోని ముఖ్యమైన ప్రాంతాల వివరాలు, నిషేధిత ప్రాంతాలు, సరిహద్దులో సైన్యం కదలికలు, కొత్తగా నిర్మిస్తున్న బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని పాక్ కు పంపుతున్నాడని గుర్తించారు.

ఇంటర్నెట్ సాయంతో ఫోటోలు, ఎస్ఎంఎస్ లు పంపడంతో పాటు ఐఎస్ఐ అధికారులతో మాట్లాడుతుండేవాడని, గత నెలలో నాలుగు రోజులు దుబాయ్ లో ఎంజాయ్ చేసి వచ్చాడని పోలీసులు తెలిపారు. దుబాయ్ నుంచి రవి ఖాతాకు డబ్బులు వచ్చాయని అన్నారు. ఇంకా ఎంతమంది ఇటువంటి వాళ్లు ఉన్నారన్న విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు ప్రారంభించి, యువతను ఆకర్షించడమే పనిగా పాక్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

More Telugu News