MS Dhoni: నిషేధం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరమయ్యా: భావోద్వేగానికి గురైన ధోనీ

  • రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కు దూరమయ్యా
  • తిరిగి చెన్నై జట్టులోకి రావడం ఉద్వేగాన్ని కలిగిస్తోంది
  • పసుపు రంగు జెర్సీని ధరించడం ఆనందాన్నిస్తోంది

ప్రశాంతతకు మారుపేరైన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని.. వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో ఆడనున్నాయి. చెన్నై జట్టుకు ధోనీ నాయకత్వం వహించనున్నాడు. ఈ సందర్భంగా ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యాడు.

నిషేధం కారణంగా రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ కు దూరమయ్యానని... ఈ రెండేళ్లు పూణె సూపర్ జెయింట్స్ కు ఆడానని ధోనీ చెప్పాడు. తిరిగి సొంత జట్టులోకి వచ్చిన ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా ఉందని తెలిపాడు. జార్ఖండ్ కు చెందినవాడినైనా తన సొంత రాష్ట్రానికి తాను ఆడింది చాలా తక్కువని చెప్పాడు. భారత్ తరపున 89 టీ20 మ్యాచ్ లు ఆడిన తాను... చెన్నై తరపున ఎనిమిదేళ్లలో 159 మ్యాచ్ లు ఆడానని తెలిపాడు. తిరిగి ఈ ఏడాది పసుపు రంగు జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ 8న ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

More Telugu News