Lanco: లగడపాటి కంపెనీపై దివాలా ప్రక్రియ మొదలు!

  • దివాలా తీసిన ల్యాంకో తీస్థా
  • బ్యాంకులకు కట్టాల్సిన రూ. 313 కోట్ల కోసం ఆస్తుల జప్తు
  • ఉత్తర్వులు జారీ చేసిన ట్రైబ్యునల్

పార్లమెంట్ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఫ్యామిలీకి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకుల నుంచి రూ. 313.10 కోట్లను రుణంగా పొంది తిరిగి తీర్చడంలో విఫలమైన నేపథ్యంలో, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు దివాలా ప్రక్రియ మొదలైంది. ఐఆర్పీ (దివాలా పరిష్కార నిపుణుడు)గా హుజేఫా సితాబ్ ఖాన్ ను నియమించినట్టు వెల్లడించింది.

 ల్యాంకో తీస్థా సంస్థ తన ఆస్తులను విక్రయించరాదని, బదలాయింపు తాకట్టు పెట్టడం వంటి పనులు చేసేందుకు కూడా చేయరాదని ఈ సందర్భంగా ట్రైబ్యునల్ పేర్కొంది. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ప్రకటన ఇవ్వాలని, ఇన్ సాల్వెన్సీ బ్యాంక్ రప్టెసీ బోర్డ్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో వివరాలు ఉంచాలని ఆదేశించింది. రుణదాతలతో కమిటీ వేసి, సంస్థ ఆస్తిపాస్తుల వివరాలు బయటకు తీయాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

కాగా, 2007లో సిక్కింలోని తీస్థా నదిపై 500 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఐసీఐసీఐ నేతృత్వంలోని పలు బ్యాంకుల కన్సార్టియం నుంచి ల్యాంకో సంస్థ రూ. 400 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలం కాగా, గతంలోనే దీన్ని మొండి బకాయిల జాబితాలో చేరుస్తున్నట్టు ఐసీఐసీఐ పేర్కొంది. చెల్లించిన మొత్తం మినహాయిస్తే గత సంవత్సరం నవంబర్ నాటికి మొత్తం బకాయి 313.10 కోట్లకు చేరగా, బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం నోటీసులు కూడా ఇచ్చింది. జల విద్యుత్ కేంద్రాల తిరోగమనంతో తమకు నష్టం వాటిల్లిందని ల్యాంకో తీస్థా న్యాయవాదులు వాదించినప్పటికీ ఆ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.

More Telugu News