atm: తెలుగు రాష్ట్రాల్లో నోట్లకు తీవ్ర కొరత... వెలవెలబోతున్న ఏటీఎంలు

  • మహారాష్ట్ర, కేరళ నుంచి నగదును తెస్తున్న బ్యాంకులు
  • ప్రజల నుంచి పెరిగిన ఉపసంహరణలు
  • ప్రస్తుతం నగదు అందుబాటు 60 శాతమే

తెలుగు ప్రజలు ఇప్పుడు తీవ్ర నోట్ల కొరత ఎదుర్కొంటున్నారు. మళ్లీ డీమోనిటైజేషన్ తర్వాతి పరిస్థితులు వారి కళ్లకు కడుతున్నాయి. ఎక్కడ చూసినా ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా 2,000 నోట్లకు తీవ్ర కొరత ఉందని బ్యాంకు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆర్ బీఐ నుంచి తగినంత నగదు సరఫరా లేకపోవడం ఒకవైపు, మరోవైపు ప్రజలు తమ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉండడం వంటి పరిస్థితులు నోట్ల కొరతకు కారణాలుగా పేర్కొంటున్నారు. ఈ కొరతను అధిగమించడానికి బ్యాంకు అధికారులు ఆర్ బీఐ అనుమతితో పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కేరళ నుంచి నోట్లను తీసుకువస్తున్నారు.

‘‘ఆర్ బీఐ అనుమతి తీసుకుని మహారాష్ట్ర, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ కు కరెన్సీని తీసుకొచ్చాం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో బ్యాంకు శాఖల నుంచి ఏటీఎంల నుంచి విత్ డ్రాలు పెరగడంతో పరిస్థితిని అధిగమించేందుకు ఇలా చేయాల్సి వచ్చింది’’ అని ఎస్ బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ స్వామినాథన్ తెలిపారు. అయితే, నేటి నుంచి వచ్చే వారంలో బ్యాంకులు సమారు నాలుగు రోజులు (గుడ్ ఫ్రైడే, ఆదివారం, ఏప్రిల్ 2, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి) పనిచేయకపోవడం తెలిసిందే. దీంతో నగదు కటకట మరింత పెరిగే అవకాశాలున్నాయి.

More Telugu News