Ludhiana: లూథియానాలో చిత్రం.... పదో తరగతి పరీక్షలు రాస్తున్న తల్లీకొడుకులు!

  • 44 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షలకు హాజరు
  • భర్త ప్రోత్సాహంతోనే ఆపేసిన చదువును పూర్తి చేస్తున్న వైనం
  • ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు సహాయకురాలిగా విధులు

లూథియానాలో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ 44 ఏళ్ల మహిళ తన కొడుకుతో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతోంది. వివరాల్లోకెళితే, ఆమె పేరు రజనీ బాలా. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె వార్డ్ సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే మధ్యలోనే వదిలేసిన తన చదువును తిరిగి పూర్తి చేయడానికి ఆమె నడుం బిగించింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి నెల రోజుల పాటు సెలవు పెట్టింది.

"ప్రభుత్వ ఆసుపత్రిలో నేను వార్డు సహాయకురాలిగా పనిచేస్తున్నాను. నా పదో తరగతి చదువును పూర్తి చేయాలని అనుకుంటున్నాను. తొలుత, స్కూల్‌కి వెళ్లడానికి నాకు అదోలా అనిపించింది. కానీ, ఇప్పుడు బాగానే ఉంది" అని రజనీ బాలా చెప్పుకొచ్చింది. తన భర్త ప్రోత్సాహంతోనే చదువుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది.

తెల్లవారుజామున తనకు, తన కొడుక్కి తన భర్తే చదువు పరంగా ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నాడని ఆమె చెప్పింది. తన కుమార్తెలు కూడా తనకు ఎంతగానే సాయపడుతున్నారని ఆమె తెలిపింది. కాగా, రజనీ 1989లో తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా తర్వాత చదువు మానేసింది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత హిందీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్టులో డిగ్రీ చేస్తానని ఆమె అంటోంది. ఆమె పట్టుదలకు కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా మెచ్చుకుంటున్నారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి రజనీ ఆదర్శం కాగలదని వారంటున్నారు.

More Telugu News