Australia: బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో సచినే ఉన్నాడు... మీరెందుకు సిగ్గుపడుతున్నారు?: షేన్ వార్న్

  • ఏడాది నిషేధం చాలా పెద్ద శిక్ష
  • నేనైతే ఒక టెస్టు నిషేధం, భారీ జరిమానా వేసేవాడిని
  • గత ఐదేళ్లుగా ఆసీస్ క్రికెటర్లు చేసిన ప్రతిపనిని విమర్శిస్తున్నారు

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ విషయంలో ఆటగాళ్లు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అని ప్రశ్నించాడు. బాల్ ట్యాంపరింగ్‌ తో క్రికెట్ లో చీటింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదని గుర్తు చేశాడు. ఈ వివాదంలో సఫారీ ప్రస్తుత కెప్టెన్ డు ప్లెసిస్ రెండుసార్లు, అదే జట్టు బౌలర్ ఫిలాండర్ ఒకసారి దొరికారని పేర్కొన్నాడు. ఈ వివాదంలో సచిన్ టెండూల్కర్, మైక్ అథెట్రాన్ వంటి దిగ్గజాలే ఉన్నారని పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు ఆందోళన చెందడం సరికాదని పేర్కొన్నాడు.

స్మిత్ తన దృష్టిలో అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని, మంచి మనిషని తెలిపాడు. అయితే మ్యాచ్ లో చాలా తెలివితక్కువ పని చేశాడని మండిపడ్డాడు. స్మిత్, వార్నర్ కి విధించిన శిక్ష చాలా దారుణమైందని పేర్కొన్నాడు. ఏడాది నిషేధం చాలా పెద్ద శిక్ష అని పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వివాదం ఒక ఆస్ట్రేలియన్‌ గా, క్రికెట్ ప్రేమికుడి గా తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపాడు.

ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదని చెప్పాడు. గత ఐదేళ్లుగా ఆసీస్ క్రికెట్‌ జట్టు చేస్తున్న పనులను ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన తప్పిదానికి కఠిన శిక్ష సబబే అయినప్పటికీ ఏడాది నిషేధం చాలా పెద్ద శిక్ష అని పేర్కొన్నాడు. తానైతే వారిని పదవుల నుంచి తప్పించి, ఒక టెస్టు నిషేధంతోపాటు భారీ జరిమానా విధించేవాడినని తెలిపాడు. 

More Telugu News