Google India: భారత్‌లో గూగుల్ 'స్ట్రీట్ వ్యూ' సర్వీసుకు చుక్కెదురు

  • గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీసుకు భద్రతా కారణాల వల్ల అనుమతి నిరాకరణ
  • వేలూరు ఎంపీ బాలసుబ్రమణ్యం ప్రశ్నకు కేంద్ర మంత్రి గంగారం అహీర్ సమాధానం
  • ప్రస్తుతం 82 దేశాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ సేవలు

భారత్‌లో 'స్ట్రీట్ వ్యూ' సర్వీసును ప్రారంభించాలనుకున్న ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ చేసిన ప్రతిపాదనను భద్రతా కారణాలతో తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారం అహీర్ వెల్లడించారు. వేలూరు ఎంపీ బాలసుబ్రమణ్యం రాతపూర్వకంగా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. బహిరంగ ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో షూట్ చేసి చూపించేందుకు అనుమతి కావాలంటూ గూగుల్ ఇండియా జులై, 2015లో భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ఈ స్ట్రీట్ వ్యూ సర్వీసును తొలుత 2011లో బెంగళూరులో ప్రారంభించారు.

నగరంలోని కొన్ని బహిరంగ ప్రదేశాలను గూగుల్ సిబ్బంది కెమేరాలో  బంధిస్తుండటాన్ని స్థానిక అధికారులు వ్యతిరేకించారు. వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సర్వీసు అక్కడితో ఆగిపోయింది. కాగా, మళ్లీ అదే ఏడాదిలో గూగుల్ భారత్‌లోని 31 చారిత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఈ సర్వీసు ప్రారంభం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉంది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ సర్వీసుకు భారత్‌లో చుక్కెదురైనట్లు స్పష్టమయింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీసు ప్రస్తుతం 82 దేశాల్లో ఉంది.

More Telugu News