సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటి వాడు పవన్.. విజయసాయి గలీజు, గబ్బు వ్యక్తి: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి

28-03-2018 Wed 13:31
  • పవన్ వ్యవహారశైలి ఆయనకే అర్థం కావడం లేదు
  • కాళ్లు పట్టుకున్నా విజయసాయిని దేవుడు కూడా కాపాడలేడు
  • ఒక గబ్బు వ్యక్తా మా గురించి మాట్లాడేది?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారశైలి ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు.

విజయసాయి రెడ్డి నీచాతినీచంగా మాట్లాడుతున్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. స్వలాభం కోసం సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బెంగళూరులో తన పెద్దల పేరుతో తాను ట్రస్ట్ ను నిర్వహిస్తుంటే... క్లబ్ నడుపుతున్నానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు విజయసాయి నిరూపిస్తే... ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. విజయసాయి గలీజు, గబ్బు వ్యక్తి అని అన్నారు. విజయసాయి చరిత్రే గబ్బు అని చెప్పారు. ఆయనకు మతి భ్రమించిందని, అందుకే గతి తప్పాడని చెప్పారు.

కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని... కాళ్లు పట్టుకున్నా దేవుడు కూడా అతన్ని కాపాడలేడని అన్నారు. తప్పుడు లెక్కలు, దొంగ కంపెనీలు పెట్టడంలో విజయసాయి దిట్ట అని చెప్పారు. ఇలాంటి గబ్బు వ్యక్తా తమ గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఆయన ఒక కుసంస్కారి అని... మొత్తం వైసీపీనే సంస్కారం లేని పార్టీ అని విమర్శించారు. వైయస్ కుటుంబ చరిత్ర గొప్పదా? తన కుటుంబ చరిత్ర గొప్పదా? అనే విషయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

రాష్ట్రానికి ఎంతో చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... చివరకు పిండాకూడు మెతుకులు వేసిందని మండిపడ్డారు. బీజేపీలో బీ అంటే బీజేపీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు.