Horlicks: అమ్మకానికి హార్లిక్స్... పోటీలో నెస్లే, యూనీలివర్!

  • ఇండియాలో ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ గా ఉన్న హార్లిక్స్
  • విలువ సుమారు రూ. 25 వేల కోట్లు
  • 140 సంవత్సరాలుగా మార్కెట్లో హార్లిక్స్

ఇండియాలో ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ గా ఉన్న హార్లిక్స్ ను విక్రయించేందుకు గ్లాక్సో స్మిత్ క్లయిన్ నిర్ణయించుకోగా, ప్రజల్లో మంచి పేరున్న హార్లిక్స్ ను సొంతం చేసుకునేందుకు నెస్లే, క్రాఫ్ట్ హీంజ్, యూనీలివర్ వంటి ఆహారోత్పత్తుల సంస్థలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. హార్లిక్స్ బ్రాండ్ కు సుమారు రూ. 25 వేల కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) వరకూ ధర వస్తుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ఉన్న హార్లిక్స్, భారత్ లో ఎంతో పాప్యులర్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం జీఎస్కే భారత అనుబంధ విభాగంలో హార్లిక్స్ కు 72.5 శాతం వాటా ఉండగా, దీని విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 3.1 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని, ఈ మొత్తంపై అధిక ప్రీమియంను ఆఫర్ చేసే సంస్థకు హార్లిక్స్ బ్రాండ్ ను అప్పగించాలని జీఎస్కే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీగా ఉన్న నెస్లే, జీఎస్కే మధ్య హార్లిక్స్ విక్రయంపై గతంలోనే చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా స్పందించడానికి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న నెస్లే నిరాకరించింది.

సుమారు 140 సంవత్సరాలుగా హార్లిక్స్ విక్రయాలు సాగుతున్నాయి. 1873లో ఇద్దరు బ్రిటీష్ సోదరులు జేమ్స్, విలియమ్ హార్లిక్స్ లు తొలిసారిగా షికాగోలో తమ కంపెనీని ప్రారంభించి హార్లిక్స్ తయారీని ప్రారంభించారు. తొలి ప్రపంచయుద్ధం జరిగిన సమయంలో బ్రిటన్ ఆర్మీకి మరింత శక్తి కోసం హార్లిక్స్ ను అందించారు.

More Telugu News