Bharat Ane Nenu: విజయవాడలో అయితే పొలిటికల్ కాంట్రవర్శీ... 'భరత్ అనే నేను' ఈవెంట్ హైదరాబాద్ లోనే!

  • తొలుత వైజాగ్ లో చేయాలని ప్లాన్
  • ఆపై విజయవాడకు మారిన ఈవెంట్
  • రాజకీయ దుమారం వద్దన్న ఆలోచనలో మహేష్
  • హైదరాబాద్ కు మారిన వేదిక

వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైన మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విజయవాడ నుంచి హైదరాబాద్ కు మారింది. విజయవాడలో ఈ వేడుక చేస్తే రాజకీయ వివాదాలు తలెత్తవచ్చని చిత్ర యూనిట్ తో పాటు మహేష్ బాబు కూడా భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

సహజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్, తన చిత్రం కొత్త రాజకీయ దుమారానికి కేంద్రం కాకూడదని స్వయంగా నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కాజ టోల్ ప్లాజా సమీపంలో ఇటీవల పవన్ కల్యాణ్ 'జనసేన' ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిన చోటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలని తొలుత నిర్మాతలు భావించారు. అందుకు కావలసిన అనుమతులు కూడా కోరారు. అంతకుముందు వైజాగ్ లో ఈవెంట్ చేయనున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనక్కు తగ్గి, హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. కాగా, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేయాల్సి వుంది.

More Telugu News