journalist: ఏపీలో జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కానికి తుదిరూపు

  • పాత్రికేయులకు గృహాల నిర్మాణంపై స‌బ్ క‌మిటీ భేటీ
  • గృహాల మంజూరుకు విధి విధానాల‌పై చ‌ర్చ‌
  • ఇళ్ల‌కు రాయితీల‌పై చ‌ర్చించిన మంత్రులు
  • ప్ర‌స్తుత గృహ‌ నిర్మాణ ప‌థ‌కాల ప‌రిధిలోనే ఇళ్ల మంజూరు
  • స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు కాల్వ శ్రీ‌నివాసులు, నారాయ‌ణ‌

ఆంధ్రప్రదేశ్‌లో జ‌ర్న‌లిస్టులు ఎంత‌గానో ఎదురు చూస్తోన్న జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కానికి తుదిరూపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స‌బ్‌క‌మిటీ త‌మ క‌స‌ర‌త్తును వేగ‌వంతం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ ప‌థ‌కానికి వంద కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డంతో గృహ‌నిర్మాణాన్ని మ‌రింత త్వ‌ర‌గా ముందుకు తీసుకెళ్లాల‌ని స‌బ్‌క‌మిటీ స‌భ్యులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా స‌బ్‌క‌మిటీ స‌భ్యులు రాష్ట్ర స‌మాచార‌, గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి నారాయ‌ణ ఈ రోజు పలువురు అధికారులతో స‌మావేశ‌మై జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కానికి విధివిధానాలు రూపొందించే దిశ‌గా చ‌ర్చించారు.

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, స్థ‌లాలు లేని జ‌ర్న‌లిస్టుల‌కూ ఇళ్ల కేటాయింపు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హామీ మేర‌కు త్రిపుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరుకోసం ప్ర‌భుత్వం ద్వారా అందించాల్సిన రాయితీల‌పై మంత్రులు చ‌ర్చించారు. రాష్ట్రంలోని పాత్రికేయుల‌కు వారి అర్హ‌త‌ల మేర‌కు ప్ర‌భుత్వం గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇళ్ల‌ నిర్మాణం కోసం అమ‌లు చేస్తోన్న ప్ర‌స్తుత కేంద్ర‌, రాష్ట్ర ప‌థ‌కాల ప‌రిధిలోనే జ‌ర్న‌లిస్టుల‌కూ ఇళ్లను మంజూరు చేయాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. జ‌ర్న‌లిస్టుల‌కు మంజూరుచేసే ఇళ్ల‌కు సాధార‌ణ ల‌బ్దిదారుల‌కు ఇచ్చే రాయితీల‌కు అద‌నంగా మ‌రికొంత రాయితీ ఇచ్చే విషయంపై కూడా ఈ స‌మావేశంలో ప్ర‌తిపాదించారు.  

ప్ర‌స్తుతం మండ‌ల కేంద్రాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1.50 ల‌క్ష‌ల‌తో సాధార‌ణ ల‌బ్దిదారుల‌కు ఇళ్లు మంజూరు చేస్తుండ‌గా, దీనికి అద‌నంగా జ‌ర్న‌లిస్టుల‌కు మ‌రో ల‌క్ష రూపాయ‌లు రాయితీ అందించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. ప‌ట్ట‌ణాల్లో ల‌బ్దిదారులు త‌మ సొంత స్థ‌లంలో ఇళ్లు నిర్మించుకొనే ప‌థ‌కంలో భాగంగా ఇళ్లు నిర్మించుకొనే జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న రూ.2.50 ల‌క్ష‌ల రాయితీకి అద‌నంగా మ‌రో రూ.1.50 లక్ష‌లు రాయితీగా అందించాల‌ని భావిస్తున్నారు. అంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ల‌బ్దిదారుల‌కు ఇళ్ల‌ను ఏపీ టీడ్కో సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ ద్వారా ప్ర‌స్తుతం అమ‌లులో వున్న మూడు కేట‌గిరీల‌కు చెందిన ఇళ్ల‌లో ఏ కేట‌గిరిలో ఇళ్ల‌ను నిర్మించుకోవాల‌నే స్వేచ్ఛ‌ను జ‌ర్న‌లిస్టుల‌కే విడిచి పెట్ట‌నున్నారు.

చంద్ర‌బాబు నాయుడు జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించుకోడానికి ముందుకు వ‌చ్చే వారికి వాటిని మంజూరు చేయాల‌ని మంత్రులు నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వం ఇచ్చే రాయితీల‌కు బ్యాంకుల రుణాల‌ను జ‌త‌చేసి ఇళ్ల‌ను నిర్మించ‌నున్నారు. స‌బ్‌క‌మిటీ స‌భ్యులంద‌రితో పూర్తిస్థాయి స‌మావేశాన్ని త్వ‌ర‌లోనే ఏర్పాటుచేసి జ‌ర్న‌లిస్టు గృహ‌నిర్మాణ ప‌థ‌కానికి తుదిరూపు ఇవ్వాల‌ని మంత్రులు నిర్ణ‌యించారు.

More Telugu News