Rs 350 denomination: త్వరలో రూ.350 నాణేలు రాబోతున్నాయ్!

  • 'శ్రీ గురు గోబింద్ సింగ్ జీ' 350వ జయంతి సందర్భంగా రూ.350 నాణేల విడుదల
  • దీని బరువు 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల వరకు
  • పరిమిత సంఖ్యలో ముద్రించవచ్చని అంచనా

'శ్రీ గురు గోబింద్ సింగ్ జీ' 350వ జయంతిని పురస్కరించుకుని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) త్వరలో రూ.350 నాణేలను తీసుకురానుంది. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంటుంది. దీనిని వెండి (50 శాతం), కాపర్ (40శాతం), నికెల్ (5శాతం), జింక్ (5శాతం)తో తయారు చేస్తారు. నాణెం ముందు భాగంపై అశోక స్తంభం ఉంటుంది. దిగువ భాగంలో 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది. ఎడమవైపున దేవనాగరి లిపిలో భారత్ అని, కుడివైపున ఇండియా అని ఆంగ్లంలో రాసి ఉంటుంది. అలాగే రూపీ సింబల్ కూడా ఉంటుంది.

అశోక స్తంభం లైన్ కేపిటల్ కింద '350' సంఖ్య ముద్రించి ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో దీని విశిష్టతలను వివరించింది. ఇక నాణేనికి వెనుక భాగాన 'తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహెబ్' బొమ్మ ఉంటుంది. పై భాగంలో '350వ ప్రకాశ్ ఉత్సవ్ ఆఫ్ శ్రీ గురు గోబింద్ సింగ్ జీ' అని దేవనాగరి లిపిలోనూ, దిగువ భాగంలో ఆంగ్లంలోనూ రాసి ఉంటుంది. ఎడమ, కుడి వైపు భాగాల్లో 1666-2016 సంవత్సరాలను ముద్రించి ఉంటారు. కాగా, ఈ నాణెం బరువు 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల వరకు ఉంటుంది. ఆర్బీఐ వీటిని పరిమిత సంఖ్యలో ముద్రించవచ్చని తెలుస్తోంది.

More Telugu News