karnataka: దక్షిణ భారతంలో మోగిన ఎన్నికల నగారా... కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • మే 12న పోలింగ్
  • అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • ఈవీఎంలతో పాటు, వీవీపాట్ మెషీన్ల వినియోగం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 15న ఫలితాలు వెలువడుతాయని వెల్లడించింది. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నట్టు తెలిపింది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలను కూడా ఈవీఎంలకు జత చేస్తున్నామని... దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. పోలింగ్ బూత్ లలో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని... 450 పోలింగ్ స్టేషన్లను మొత్తం మహిళలే నిర్వహిస్తారని చెప్పింది. ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎన్నికల కోడ్ రాష్ట్రానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని ఈసీ తెలిపింది. తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేలా... బలహీనవర్గాల ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు సంబంధించి రూ. 28 లక్షలకు సీలింగ్ విధిస్తున్నామని తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 4.96 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 17
నామినేషన్లకు తుది గడువు: ఏప్రిల్ 24
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: ఏప్రిల్ 27
ఎన్నికల తేదీ: మే 12
ఓట్ల లెక్కింపు తేదీ: మే 15

More Telugu News