Marriage: మహబూబ్‌నగర్ జిల్లాలో వింత ఆచారం....ప్రేమికుల విగ్రహాలకు వివాహం!

  • ప్రేమ ఫలించక ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల జంట
  • కుమారుడి జ్ఞాపకార్థం ఇంటి ఆవరణలో ఆలయం నిర్మాణం..అందులో అతని ప్రియురాలి విగ్రహం కూడా ఏర్పాటు
  • 14 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు ప్రేమికుల విగ్రహాలకు వివాహం జరిపిస్తున్న వైనం

మహబూబ్‌నగర్ జిల్లా, బయ్యారం మండలం, సంతులాల్‌పోడు తండాలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ప్రేమ ఫలించక ఆత్మహత్య చేసుకుని మరణించిన ఓ జంటకు గతంలో ఓ ఆలయాన్ని నిర్మించారు. అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు వారికి కల్యాణం జరిపిస్తున్నారు. వివరాల్లోకెళితే...14 ఏళ్ల కిందట సంతులాల్‌పోడు తండాకు చెందిన లాలు, సుక్కమ్మ దంపతుల కుమారుడు రామకోటి ప్రేమ ఫలించకపోవడంతో తన ప్రేయసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో తమ కుమారుడి జ్ఞాపకార్థం అతనితో పాటు అతను ప్రేమించిన యువతి విగ్రహంతో కూడిన ఆలయాన్ని వారు తమ ఇంటి ఆవరణలోనే నిర్మించారు. సోమవారం జరిగిన కల్యాణానికి బంధువులు, తండా వాసులు కూడా హాజరయ్యారు. వారు చనిపోయి ఇన్నేళ్లవుతున్నా లాలు, సుక్కమ్మ దంపతులు ఏటా వారి విగ్రహాలకు వివాహం జరిపిస్తుండటాన్ని పలువురు గ్రామస్థులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వారు బతికున్నప్పుడే అందరూ సమ్మతించి వివాహం చేసుంటే ఇప్పుడు వారి విగ్రహాలకు ఇలా పెళ్లి చేయాల్సిన అవసరం ఉండేది కాదనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News