triple talaq: ట్రిపుల్ తలాక్ అయిపోయింది.. ఇక బహుభార్యత్వం, నిఖాపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు

  • బహుభార్యత్వం, నిఖా రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్
  • వైఖరి చెప్పాల్సిందిగా కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు
  • కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీం బెంచ్

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ ఏడు నెలల క్రితం తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు ముస్లింలలో బహుభార్యత్వం, నిఖాపై దృష్టి సారించింది. ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

బహుభార్యత్వం, నిఖాలపై దాఖలైన పిల్‌ను స్వీకరించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం వీటిపై తన వైఖరేంటో చెప్పాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

నిఖా, హలాలా, నిఖా ముతా, నిఖా మిస్యార్ తదితర వివాహ పద్ధతులతోపాటు బహుభార్యత్వాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా చట్ట విరుద్ధం కూడా అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

నిఖా హలాలా అనేది విడాకుల తర్వాత కూడా తిరిగి కలిసి ఉండాలని భావించే మహిళలకు ఉద్దేశించినది. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో కొంతకాలం పాటు పెళ్లి పేరుతో కలిసి ఉండడం నిఖా ముతా. అంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న మాట. ఇందులో మహిళకు ఎటువంటి అధికారాలు ఉండవు. రాతపూర్వకంగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు.

నిఖా మిస్యార్ కూడా నిఖా ముతా లాంటిదే. ఇందులో భార్య, భర్త ఇద్దరూ కలిసి ఉండడం లాంటి వివాహ హక్కులను వదులుకుంటారు. భార్య కేవలం ఇంటి పనులు, డబ్బు నిర్వహణను చూసుకోగా, భర్త ఇంటికి కావాల్సిన పనులు చూసుకుంటాడు.

More Telugu News