ranganaika sagar: వచ్చే శ్రీరామ నవమి నాటికి రంగాయక సాగర్ నిండు కుండలా మారుతుంది : మంత్రి హరీశ్ రావు

  • రంగనాయక సాగర్ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
  • రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి
  • మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు 

వచ్చే శ్రీరామ నవమి నాటికి రంగాయక సాగర్ నిండు కుండలా మారుతుందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ దగ్గర నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రంగానాయక స్వామి దీవెనలతో ఈ ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారనుందని అన్నారు. మరో మూడు నెలల్లో రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి గోదావరి జలాలతో రిజర్వాయర్ నింపాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రంగనాయక సాగర్ పనుల పురోగతిని ఆయన క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. రిజర్వాయరు కట్టకు సంబంధించిన 2100 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, పైపులైను పనులు ప్రారంభించాలని, రిజర్వాయరు వెనుక వైపున ఎఫ్ఆర్ఎల్ వద్ద ఈత మొక్కలు నాటి, ఆ ప్రాంతమంతా ఈత వనాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రంగనాయక సాగర్ రిజర్వాయరులో అప్రోచ్ కెనాల్స్, టన్నెల్  పనులు తొందరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ లోని ఎడమ కాలువ పనులు జాప్యం జరగకుండా చూడాలని అన్నారు. జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు రూ.463 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ , కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల వలయంగా మారనుందని అన్నారు.  ఈ రిజర్వాయర్ల ద్వారా సిద్దిపేట జిల్లాకే కాకుండా ఉమ్మడి మెదక్  జిల్లాకు సాగునీరును అందించే కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు చెప్పారు.

కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి పొరుగున ఉన్న పూర్వ నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు అందుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి సిద్ధిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్‌కు నీళ్లు వస్తాయని, అక్కడి నుంచి టన్నెల్, ఓపెన్ కెనాల్ ద్వారా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను నింపి.. కొమురవెల్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తామని  చెప్పారు.

కాగా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్, రామంచ, లింగారెడ్డిపల్లి, ఇమాంబాద్, పెద్దకోడూరు గ్రామాల శివారుల మధ్య రంగానాయకసాగర్ రిజర్వాయర్‌ నిర్మాణమవుతోంది. ఈ రిజర్వాయర్ కట్ట సుమారు 8.65 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణంలో ఉంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ చుట్టూ కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కట్ట ఎత్తు 32.4 మీటర్లు కాగా గ్రౌండ్ లెవల్‌లో కట్ట వెడల్పు 196 మీటర్లతో ఉండి పైభాగానికి వచ్చే సరికి 6 మీటర్ల వెడల్పుతో ఉంటుందన ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు. రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు ఇస్తారు. ఎడమ కాల్వ ద్వారా 70 వేల ఎకరాలు, కుడి కాల్వ ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

More Telugu News