Facebook: ఈ స్థానానికి అనర్హులం: పలు పత్రికల్లో ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్ క్షమాపణలు

  • మమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు
  • డేటా భద్రత మా ప్రధాన కర్తవ్యం
  • ఇంతముమించి ఏమీ చెప్పలేము
  • ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్

డేటా చోరీ ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, నష్ట నివారణ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ పేరిట బ్రిటన్, అమెరికాల్లోని ప్రధాన పత్రికల్లో, తమను క్షమించాలంటూ ప్రకటనలు విడుదల చేశారు. డేటా చౌర్యానికి కారణాలు తెలుపుతూ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రీసెర్చర్ గా ఉన్న ఓ వ్యక్తి ఫేస్ బుక్ కోసం 'క్విజ్' పేరిట ఓ యాప్ ను రూపొందించారని, దాని ద్వారానే డేటా దుర్వినియోగం అయిందని అన్నారు. ఇది నమ్మక ద్రోహమేనని అంగీకరించిన ఆయన, సమాచార భద్రత తమ బాధ్యతని, దాన్ని నెరవేర్చకుంటే ఈ స్థానానికి అనర్హులమని అన్నారు.

డేటా భద్రత తమ అత్యంత ప్రధానమైన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చేయలేని, చెప్పలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇండియా, అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేసేలా 5 కోట్ల ఫేస్ బుక్ ఖాతాలను కేంబ్రిడ్జి అనలిటికా దుర్వినియోగం చేసిందన్న విషయం బహిర్గతమై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఏదైనా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలంటే, ఫోన్ లోని మెసేజ్ లు, కాంటాక్టులకు యాక్సెస్ ఇవ్వాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ తరహా యాప్ లను సైబర్ నేరగాళ్లు డెవలప్ చేసి ఉంటే, ఫోన్ లోని సమస్త సమాచారం వారి సర్వర్లలోకి వెళ్లిపోతుందని, ఈ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News