Smith: అనతికాలంలోనే అత్యున్నత శిఖరాలు.. బాల్ ట్యాంపరింగ్‌తో అగాధంలోకి..

  • ఆసీస్ రన్ మెషీన్‌గా ఖ్యాతి గాంచిన స్మిత్
  • బ్రాడ్‌మన్‌తో పోల్చుతూ మురిసిపోతున్న అభిమానులు
  • బాల్ ట్యాంపరింగ్‌తో అప్రతిష్ఠపాలు
  • ఒక్క తప్పుడు పనితో జేజేలు పలికిన నోళ్ల తెగుడుతున్న వైనం

స్టీవ్ స్మిత్.. ప్రపంచ క్రికెట్‌లో సంచలనం. టెస్టు క్రికెట్‌లో రికార్డులు పోగేసుకుంటూ రన్ మెషీన్‌గా ఖ్యాతిగాంచిన ఆసీస్ టెస్ట్ కెప్టెన్. బ్యాట్ కదిపితే పరుగుల వానే. సెంచరీలు అతడి పాదాక్రాంతమయ్యాయి. జట్టులోకి వచ్చిన కొత్తలో ఎనిమిదో స్థానంలో వచ్చే ఈ ఆటగాడు అసాధరణ ప్రతిభతో ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఒక్కో రికార్డును బద్దలు కొట్టుకుంటూ పోయాడు. ఫలితంగా దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో అతడిని పోల్చారు. అంతేకాదు.. టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు.  943 పాయింట్లతో బ్రాడ్‌మన్ రికార్డును వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతికాలంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన స్మిత్ ఇప్పుడు పాతాళమంత అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. బ్రాడ్‌మన్ కావాల్సినోడు బ్యాడ్ బాయ్‌గా మారి యావత్ ప్రపంచం ముందు దోషిగా నిల్చుకున్నాడు.

బ్యాటింగ్‌లో అసాధారణ నైపుణ్యం కనబరిచే స్మిత్‌ మైదానంలో జట్టును నడిపించే తీరును మాత్రం క్రీడా పండితులు తప్పు పడుతున్నారు. అణువణువునా విజయ కాంక్షతో రగిలిపోయే స్మిత్ అందుకోసం ఎంచుకున్న మార్గమే ఇప్పుడతడిని దోషిగా నిలబెట్టింది. గతేడాది డ్రెస్సింగ్ రూము వైపు చూస్తూ తనకు మతి తప్పిందని పేర్కొన్న స్మిత్ తాజాగా బాల్ ట్యాంపరింగ్‌కు పథక రచన చేసి ప్రపంచం ముందు తలవంచుకున్నాడు. స్వయంగా ఆసీస్ క్రికెటర్లే అతడు జట్టులో ఉండడానికి వీల్లేదని అంటున్నారు. ఆసీస్ ప్రధాని మాల్కలమ్ టర్న్‌బుల్ అయితే దేశం పరువు తీశారని మండిపడ్డారు. ఇలాంటి చీటర్‌ను క్రికెట్ నుంచి శాశ్వతంగా నిషేధించాలని ప్రపంచం నలుమూలల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

బాల్ ట్యాంపరింగ్‌కు తనదే బాధ్యతని నిర్లజ్జగా అంగీకరించి క్షమించమని వేడుకున్నా అతడిని క్షమించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటే అతడు ఎంతటి నేరానికి పాల్పడడ్డాడో అర్థం చేసుకోవచ్చు. జెంటిల్మన్ గేమ్‌ను కాస్తా అపఖ్యాతి పాలు చేసిన స్మిత్ ప్రస్తుతం ఓ మ్యాచ్ నిషేధంతో సరిపెట్టుకున్నా అతడి కెరియర్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గెలుపు కోసం అతడు తొక్కిన అడ్డదారులు మొత్తం ఆసీస్ క్రికెట్‌నే సంక్షోభంలోకి నెట్టేసింది.

స్మిత్ ఇటీవల వరుసగా వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. లెగ్ స్పిన్నర్‌గా అరంగేట్రం చేసి అనితర సాధ్యమైన బ్యాటింగ్‌తో ఏకంగా జట్టు పగ్గాలు చేపట్టిన స్మిత్ వేగంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. అయితే, అంతే వేగంగా వివాదాలు కొని తెచ్చుకున్నాడు. 2016లో మైదానంలో అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా వారితో గొడవపడి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా జేమ్స్ అండర్సన్, రబడతో వివాదం కూడా అతడి దుందుడుకు స్వభావానికి నిదర్శనాలే.

More Telugu News