Chandrababu: ‘రాజకీయం’ అంటారనే ఇన్నాళ్లూ ఆగాం: సీఎం చంద్రబాబు

  • తొలి బడ్జెట్ లోనే గొడవపడితే ‘రాజకీయం’ అంటారని ఆగాం
  • నాలుగు బడ్జెట్ లలోనూ ఏపీకి న్యాయం చేయలేదు
  • ఏపీకి నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం
  • విధిలేని పరిస్థితుల్లోనే పోరాట మార్గం పట్టాం  

తొలి బడ్జెట్ లోనే గొడవపడితే ‘రాజకీయం’ అంటారనే ఇన్నాళ్లూ ఆగామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాజకీయ పరిణామాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు. నాలుగు బడ్జెట్ లు చూసినా ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఏపీకి న్యాయం కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నామని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోమని కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో  కేంద్ర ప్రభుత్వం నుంచి తాము బయటకు వచ్చామని, ఎన్డీఏ నుంచి వైదొలిగామని అన్నారు. ఏపీకి నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, విధిలేని పరిస్థితుల్లోనే పోరాట మార్గం పట్టామని అన్నారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ)లు ఇచ్చామని, యూసీలు ఇవ్వనందునే నిధులు ఆపామని కేంద్రం చెప్పడం పచ్చిఅబద్ధం, దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. యూసీలు ఇవ్వలేదని రుజువు చేస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎం రమేశ్ సవాల్ విసరగా, బీజేపీ నేత జీవీఎల్ వెనక్కి తగ్గిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

ఆర్థికలోటుకు యూసీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1,050 కోట్లలో రూ.940 కోట్లకు యూసీలు ఇచ్చామని, అదే విధంగా, అమరావతికి ఇచ్చిన రూ.1000 కోట్లకు, గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350 కోట్లకు యూసీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టాలని, ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని తమ నేతలకు చంద్రబాబు సూచించారు.

More Telugu News