telugu: తెలుగు భాష‌కు పట్టం.. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ తెలంగాణ శాసనసభలో బిల్లు ఆమోదం

  • ఈ విద్యా సంవత్సరం నుంచే తెలుగు భాష అన్ని పాఠశాలల్లో తప్పనిసరి
  • మొదటి దశలో ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతిలో తప్పనిసరి
  • ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో అమలు
  • తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం

తెలుగు భాషను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేస్తూ అందుకు సంబంధించిన బిల్ ను తెలంగాణ‌ శాసనసభ ఆమోదించింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఇతర భాష పాఠశాలల్లో కూడా తెలుగు తప్పనిసరి అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్ తీసుకొచ్చామ‌ని తెలంగాణ‌ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలుగు భాష గొప్పద‌నాన్ని నిలబెట్టేందుకు, తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు, తెలుగుకు పట్టం కట్టేందుకు ఈ బిల్ తీసుకొచ్చామని చెప్పారు.

గత ప్రభుత్వాలు తెలుగు భాష పట్ల నిర్లక్షంగా వ్యవహరించాయని, తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. తెలుగు భాష తప్పనిసరి అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లుపై సభ్యులు జాఫర్ హుస్సేన్, కిషన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, సున్నం రాజయ్యలు మాట్లాడారు. తెలుగును తప్పనిసరి చేస్తూ బిల్లును తీసుకురావడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ బిల్లు అమలును శాసనసభ నుంచే మొద‌లుపెట్టాల‌ని, తెలుగు భాషలోనే శాసనసభ వ్యవహారాలు నడపాలని, ఉత్తర్వులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని సూచించారు.

ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలలో మాతృభాష అమలు కోసం ఉద్యమాలు చేశాయని, చివరకు బస్సులపై పేర్లు కూడా మాతృభాషలోనే రాశారని, ఇక్కడ కూడా అలాగే అమలు చేయాలన్నారు. ఇతర భాషల పాఠశాలల్లో ఉత్తీర్ణత మార్కులను 20కే నిర్ణయించాలని, ఒకరిద్దరు విద్యార్థులున్న చోట కచ్చితంగా ఉపాధ్యాయులను నియమించాలనే దానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు భాష తప్పనిసరిగా చదవాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, అంతే కాకుండా తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఇటీవలే తెలుగు ప్రపంచమహాసభలు బ్రహ్మాండంగా నిర్వహించారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో తెలుగును అమలు చేయడం కోసం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ తమిళనాడు, పంజాబ్ లలో పర్యటించి, అక్కడ మాతృభాషను అమలు చేస్తున్న తీరును అధ్యయనం చేశారన్నారు. తమిళనాడు మోడల్ లో తెలుగు భాషను అమలు చేయాలని ఈ బిల్ తెచ్చామన్నారు.

తొలిదశలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, రాష్ట్ర, కేంద్ర, ఇతర భాషా ప్రాథమిక పాఠశాలల్లో మొదటి తరగతిలో తెలుగు భాషను ప్రవేశపెడుతున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తెలుగు భాషను ప్రవేశపెడుతున్నామన్నారు. ఆరో తరగతిలో ప్రవేశపెట్టే భాష చాలా సులభతరంగా ఉంటుందని చెప్పారు. తెలుగు భాషను తప్పనిసరి చేయడం కోసం రూపొందించే సిలబస్ బాధ్యతలు తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయంకు అప్పగించామన్నారు. అమ్మ ఒడి పలుకులు – బడి పలుకులు కావాలనే లక్ష్యంతోనే తెలుగు తప్పనిసరి అమలు బిల్లును తీసుకొచ్చామని, దీనిని అందరూ స్వాగతించి ఆమోదించినందుకు కృతజ్ణతలు తెలుపుతున్నామ‌న్నారు.

More Telugu News