Chandrababu: తెలంగాణలో ఎవరిని అడిగి టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకుంది?: సీఎం చంద్రబాబు

  • మిత్ర‌ధ‌ర్మం మేర‌కే బీజేపీకి రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఇచ్చాం
  • మిత్ర‌ధ‌ర్మం విష‌యంలో నేను తొంద‌ర‌ప‌డ్డానా?  మీరు తొంద‌ర‌ప‌డ్డారా?
  • నేను వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఎప్పుడూ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు
  • మిత్ర‌ధ‌ర్మానికి బీజేపీయే దెబ్బ‌కొట్టింది

మిత్రధ‌ర్మాన్ని పాటించ‌కుండా త‌మ పార్టీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంద‌ని బీజేపీ నేత‌లు అంటున్నార‌ని, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణలో ఎవరిని అడిగి టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌శ్నించారు. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. తాము మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించామ‌ని, ఆ మేర‌కే బీజేపీకి రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఇచ్చామ‌ని తెలిపారు. మిత్ర‌ధ‌ర్మం విష‌యంలో తాను తొంద‌ర‌ప‌డ్డానా?  బీజేపీ తొంద‌ర‌ప‌డిందా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాను వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఎప్పుడూ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని అన్నారు.

మిత్ర‌ధ‌ర్మానికి బీజేపీయే దెబ్బ‌కొట్టిందని, ఏపీ ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌ని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీస్తే మాత్రం తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించబోమ‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో టీడీపీ ఎన్న‌డూ రాజీప‌డబోద‌ని ఉద్ఘాటించారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని తాను మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాన‌ని అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌సంగం ముగియ‌గానే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. 

More Telugu News