రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మార్పు

24-03-2018 Sat 16:51
  • ఆర్సీబీ జట్టులో నైల్ స్థానంలో కోరె అండర్సన్‌కు చోటు
  • రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకున్న ఆర్సీబీ యాజమాన్యం
  • ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా టీమ్‌తో బెంగళూరు టీమ్ మొదటి మ్యాచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో కివీస్ ప్లేయర్ కోరె అండర్సన్‌ను తీసుకున్నట్లు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ తెలిపింది. ఫలితంగా కౌల్టర్ నైల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. నైల్ గాయంతో బాధపడుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్న ప్లేయర్లలో ఎవరినైనా అవసరమైనప్పుడు ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రూ.2 కోట్ల కనీస ధరకే అండర్సన్‌ను ఆర్సీబీ దక్కించుకుంది. కాగా, ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చే నెల 7న మొదలవుతున్న సంగతి విదితమే. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8న ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.