neerav modi: నీరవ్ మోదీ ఇళ్లలో ఈడీ మళ్లీ సోదాలు.. ఖరీదైన ఆభరణాలు స్వాధీనం

  • ముంబైలోని నీరవ్ మోదీ ప్లాట్ లో ఈడీ సోదాలు
  • కోట్ల విలువ చేసే ఆభరణాలు, ఖరీదైన వాచీలు స్వాధీనం  
  • ప్రముఖ చిత్రకారులు గీసిన ఖరీదైన చిత్రపటాల గుర్తింపు
  • వీటి ఖరీదు రూ.26 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సోదాలు ప్రారంభించింది. ముంబైలోని నీరవ్ మోదీ సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్లాట్ లో జరిగిన తాజా సోదాల్లో వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.15 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.1.4 కోట్ల విలువ చేసే ఖరీదైన వాచీలు, రూ.10 కోట్ల విలువ చేసే ఒక వజ్రపుటుంగరాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

వీటితో పాటు ప్రముఖ చిత్రకారులు గీసిన ఖరీదైన చిత్రపటాలను ఈడీ అధికారులు గుర్తించారు. అమృత షేర్ గిల్, ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఈ చిత్రపటాల ఖరీదు సుమారు రూ.26 కోట్ల వరకు ఉండొచ్చని అధికారుల అంచనా. కాగా, ఈ నెల 22 నుంచి మోదీ ఇళ్లలో ఈడీ, సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు నీరవ్ మోదీకి సంబంధించి రూ.7638 కోట్ల విలువ చేసే వజ్రాలు, ఖరీదైన రాళ్లు, ఆస్తులను అటాచ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

More Telugu News