youtube: భారత్ లో యూ ట్యూబ్ హవా... నెట్ ఉన్న వారిలో 80 శాతం మంది యూ ట్యూబ్ చూసేవారే!

  • మొబైల్ నుంచి ప్రతీ నెలా 22.5 కోట్ల మంది వీడియోల వీక్షణ
  • అత్యంత వేగంగా పెరుగుతున్న యూట్యూబ్ వినియోగం
  • స్మార్ట్ ఫోన్లు, డేటా విస్తరణ తోడ్పాటు
  • గూగుల్ ఇండియా ప్రకటన

భారత్ లో యూ ట్యూబ్ దూసుకుపోతోంది. నెట్ యూజర్లలో 80 శాతం మంది యూ ట్యూబ్ చూసేవారేనట. పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు, అందుబాటు ధరలకే డేటా యూట్యూబ్ ప్రగతికి కారణమని గూగుల్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ 80 శాతం మందిలో అన్ని రకాల వయసుల వారు ఉండడం గమనార్హం. యూ ట్యూబ్ గూగుల్ అనుబంధ సంస్థ అని తెలిసిందే.

‘‘2017 డిసెంబర్ నాటి కామ్ స్కోర్ వీడియో మెట్రిక్స్ మల్టీ ప్లాట్ ఫామ్ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ యూజర్లలో 18 ఏళ్లు అంతకంటే పైన వయసు ఉండి ఎక్కువగా వినియోగించే యూజర్లలో 85 శాతం మందికి యూట్యూబ్ చేరువ అయింది’’ అని గూగుల్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు.

నేటి తరం చిన్నారులు సైతం మొబైల్ ఫోన్లలో యూట్యూబ్ చూస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరిని గణనలోకి తీసుకోలేదులెండి. కేవలం మొబైల్ నుంచే ప్రతీ నెలా 22.5 కోట్ల మంది యూట్యూబ్ ను యాక్సెస్ చేస్తున్నారట. అత్యంత వేగంగా యూట్యూబ్ వినియోగం పెరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని గూగుల్ తెలిపింది. 2020 నాటికి 50 కోట్ల మందికి యూజర్లు పెరగనున్నారని ఫిక్కి అంచనా.

More Telugu News