Consumer Forum: రెండు విమానయాన సంస్థలకు దిమ్మతిరిగే తీర్పునిచ్చిన కన్జూమర్ ఫోరం..!

  • లగేజీని కనిపెట్టడంలో నిర్లక్ష్యానికి ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించాలని స్పైస్ జెట్‌కి ఫోరం ఆదేశం
  • వృద్ధ జంట కేసులో రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని ఎయిర్ కోస్టాకి ఫోరం ఆదేశం
  • తీర్పు పట్ల ఫిర్యాదుదారుల హర్షం

ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాలకు అక్షింతలు వేస్తూ రెండు ప్రముఖ విమానయాన సంస్థలకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం-3 సంచలన తీర్పు ఇచ్చింది. మొదటగా స్పైస్ జెట్ కేసు విషయానికొస్తే, నగరంలోని అమీర్‌పేటకి చెందిన 24 ఏళ్ల ప్రణయ్ పసరి నవంబరు 1, 2016న న్యూఢిల్లీ వెళ్లడానికి స్పైస్ జెట్ విమానం ఎక్కాడు.

విమానం దిగిన తర్వాత తన లగేజీ కనిపించలేదు. లగేజీ కోసం శతవిధాలా అతను ప్రయత్నించాడు. ఇక లాభం లేదనుకుని మరుసటి ఏడాది జనవరి, 21న స్పైస్ జెట్ ఎయిర్‌లైన్ సంస్థకు ఓ లీగల్ నోటీసు పంపాడు. ఈ కేసు తీర్పు సందర్భంగా ఫోరం న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొత్త ప్రదేశానికి వెళుతున్న ప్రణయ్ లగేజీ కనిపించకపోవడంతో విమానయాన సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అతను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడని, అందువల్ల అతనికి నష్టపరిహారం కింద రూ.5 వేలు, ఇతర ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

ఎయిర్ కోస్టా కేసును పరిశీలిస్తే... సీఎస్ రామచంద్రమూర్తి, సీ.విజయ లక్ష్మీ అనే వృద్ధ జంట దాఖలు చేసిన ఫిర్యాదును ఫోరం విచారించింది. మే 15, 2016న ఆ జంట కోవై నుంచి హైదరాబాద్ బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్టులోనే తాము దాదాపు పది గంటల పాటు పడిగాపులు పడ్డామని ఆ జంట తమ ఫిర్యాదులో ఆరోపించింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సంబంధిత విమానయాన సంస్థ తమకు కనీసం దుప్పట్లను కూడా ఏర్పాటు చేయలేదని వారు పేర్కొన్నారు. వెన్నునొప్పితోనే తాను చాలాసేపు కూర్చోవాల్సి వచ్చిందని లక్ష్మి తెలిపింది. వారి వాదనతో ఏకీభవించిన ఫోరం నష్టపరిహారం కింద వారికి రూ.30 వేలు, ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఎయిర్ కోస్టా సంస్థను దిమ్మతిరిగే రీతిలో ఆదేశించింది. ఫోరం తీర్పు పట్ల ఈ రెండు కేసుల ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News