Transgender: త్వరలో హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్‌జండర్లు....!

  • హైదరాబాద్ నగరంలో త్వరలో ఐదు పెట్రోల్ బంకులు ట్రాన్స్‌జండర్లతో నిర్వహణ
  • తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
  • ఖైదీల ఉత్పత్తుల విక్రయానికి త్వరలో వెయ్యి విలేజ్ అవుట్‌లెట్ల ఏర్పాటు

సమాజంలో అనేక రకాలుగా వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జండర్లు (లింగమార్పిడి వ్యక్తులు) తమ బతుకు బండిని నడిపించడానికి భిక్షాటన, వ్యభిచారం లాంటి వృత్తులను ఆశ్రయిస్తున్నారు. జైళ్ల శాఖ పుణ్యమా అని వారికి కూడా మంచి రోజులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వారికి లాభదాయక ఉపాధిని కల్పించడానికి నడుం బిగించింది. హైదరాబాద్ నగరంలో త్వరలో ఏర్పాటు కానున్న ఐదు పెట్రోల్ బంకుల్లో వారికి ఉపాధి కల్పించనుంది. ఈ ఐదింటిని ప్రత్యేకించి ట్రాన్స్‌జండర్లే నిర్వహించనుండటం గమనార్హం. ఇలాంటి ఉపాధి వల్ల వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలరని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ఆఖరు కల్లా జైళ్ల శాఖ రాష్ట్రంలో మొత్తం వంద పెట్రోల్ పంపులను నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో ఐదింటిని ట్రాన్స్‌జండర్ల కోసం కేటాయించింది. జైళ్లు-పరివర్తన సేవల డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ఈ విషయాన్ని నిన్న మీడియాకి తెలిపారు. నగరంలోని ట్రాన్స్‌జండర్లకు పునరావాసంతో పాటు ఉపాధిని కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగానే వారికి పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. మరోవైపు జైలు ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తుల విక్రయం కోసం త్వరలోనే వెయ్యి విలేజ్ అవుట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

More Telugu News